పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

66


సీ.

అంభోధి కభిషేక మాచరించినయట్లు
                   గంగకుఁ బాద్య మొసంగినట్లు
మేరువునకు నలంకారంబు లిడినట్టు
                   లినునకు నారతు లెత్తినట్లు
మలయాచలమునకుఁ గలప మిచ్చినయట్టు
                   లిల వసంతునకుఁ బూలిడినయట్లు
భూపముఖ్యునకుఁ దాంబూల మిచ్చినయట్లు
                   సోమున కద్దంబు సూపినట్లు


తే.

నిఖిలలోకైకభర్తకు నీకు నొక్క
బిల్వదళ మార్యవర్యు లర్పించుచుంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

67


సీ.

నడచిపోవఁగ జవం బడరకుండుటఁ జేసి
                   పుణ్యతీర్థము లాడఁ బోవరాదు
కాసు వీసము చేతఁ గల్గకుండుటఁ జేసి
                   దానధర్మక్రియల్ తలఁపరాదు
తనువున రుగ్బాధ తరలకుండుటఁ జేసి
                   స్నానజపాదులు సలుపరాదు
గడితంపుటాఁకలి విడువకుండుటఁ జేసి
                   యుపవాసములు నిష్ఠ నుండరాదు


తే.

కాని నిన్నొక్కమాఱైనఁ గడఁగి తలఁప
రాదె యెన్నరు గాక దుర్మతులు మదిని,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

68