పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాఠము


సీ.

శ్రీకరధవళాంగ, శ్రితజనావనసంగ,
                   కరనివిష్టకురంగ, పురవిభంగ,
తరణిచంద్రరథాంగ, ధరణీతలశతాంగ,
                   విదళితానంగ, గోవృషతురంగ,
వలయీకృతభుజంగ, విలసితఖట్వాంగ,
                   ధృతనభోగంగ, వార్నిధినిషంగ,
మునిమనోంబుజభృంగ, ఘనసమరాభంగ,
                   అతిదయాపాంగ, పుణ్యాంతరంగ,


తే.

శైలజానుంగ, నీకొక శతక మిపుడు
కూర్చి యర్పింతుఁ గైకొమ్ము, కోర్కె లిమ్ము,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

1


సీ.

కొక్కుఁ జొక్కువయాళి జక్కి నెక్కెడి వేల్పు
                   మినుసికయెకిమీని యనుఁగుఁబట్టి
మేల్కడాని పసిండిమేని జేజేమిన్న
                   యిద్దఱుతల్లుల ముద్దుఁగొడుకు
గుజ్జుదేవర వ్రేలుబొజ్జ మేటిమగండు
                   మొలకపూవుల పూజ నలరు వలఁతి,
చిలువజన్నిదముల చెలువుండు సికను లేఁ-
                   దొగవిందుతునె పూను సొగసుకాఁడు


తే.

నను గజాననుఁ డెపుడు నిన్ బొగడు కృతులఁ
జిరకృపాస్ఫూర్తి సంపూర్తి సేయుచుండు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

2