Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Ø ‘తస్కరుల చందమునఁ బదార్థములు మ్రుచ్చిలించుచుఁ జూపించు కుకవుల నెంచనేల?’
Ø ‘కూడదనఁగను గవితలఁ గూర్చి బలిమిఁ గుమతులకు నిచ్చువాఁడొక కూళ సుమ్ము’

కుక్కుటేశ్వరశతక భావములు వేణుగోపాలశతకములోఁగూడ నక్కడక్కడఁ గనిపించుచుండినను కొంగ్రొత్త పోకడలు లేకపోలేదు.

“కాపు కవీశ్వరుల్, కంచర యోగులు, సాతాని వైష్ణవుల్, సాలె భటులు,
గోమటి దాతలు, కొంటె భాగోతులు, మాల వెజ్జులం, బోయ మావటీలు,
గొల్ల పౌరాణికుల్, పల్లె దైవజ్ఞులు, బానిస వేశ్యలు, జైన బాప
లాఁడుఁ దీర్పరు, లుగ్రయవన ధరాధీశ్వరులు, వైదిక ప్రధానులును...” (కుక్కు)

(ఛాయ-)

“నంబికవిత్వంబు, తంబళజోస్యంబు, వలనొప్పు కోమటి వైష్ణవంబు,
వరుసనే యుప్పరవాని సన్న్యాసంబు, తరువాత శూద్రసంతర్పణంబు,
రజకుని గానంబు, రండా ప్రభుత్వంబు, వెలయంగ నఱవల వితరణంబు,
సాతాని విద్వాంసశాస్త్రవాదము, వేశ్య తనయుఁ డబ్బకుఁ బెట్టు తద్దినంబు” (వేణుగోపాల)

తిమ్మకవి “కుక్కుటేశ్వరశతక”మే తరువాత వచ్చిన నీతి (సీస) శతకముల కన్నింటికి మార్గదర్శకమైనది. అట్టి శతకములలో విషయగౌరవమునుబట్టి, భావబాహుళ్యమునుబట్టి వేణుగోపాలశతకమున కగ్రతాంబూల మీవలసివచ్చును.

తిమ్మకవి క్రీ.శ. 1729 సం॥న రచించిన మఱియొక శతకమైన భర్గశతకము సమగ్రముగా నుండ, నీ కుక్కుటేశ్వర శతకములో మాత్ర మెనిమిది పద్యములు తక్కువగా నున్నవి. ఇప్పటివఱకు దొరకిన ప్రాఁత ముద్రితప్రతులన్నిటిలోను నీ లోటు ఒకేవిధముగఁ గన్పించుచుండుట వలనఁ గవి వ్రాసినవే 92 పద్యములని యూహింపవలసియున్నది. పైగా కుక్కుటేశ్వరశతకములోని కడపటి పద్య మీ యూహను బలపఱచుచున్నది. ఏవో యొకటి రెంటిలోఁ దప్పఁ దన కృతులన్నిట కట్టకడపట, వాని రచనాకాలమును, మంగళాచరణమును దిమ్మకవి విధాయకముగా వ్రాయువాఁడు. భర్గశతకమునఁ గూడ 100, 101 సంఖ్యలుగల పద్యములలో నీ ‘రివాజు’ పాటించినాఁడు. “కుక్కుటేశ్వరశతకము”లోని 92 న పద్యము” శివశివా! ధాత్రి దా వలచిన వధూటిఁ బాయు వెత వద్దు సుమ్మెట్టిపలువకైన” యని పురుష విరహమునుగూర్చి చెప్పునది. అందుచేతఁ దక్కిన యెనిమిదింటినిగూడ రచించు నుద్దేశముండియుండుననుట సబబు. అట్లు పూర్తి చేయకుండుటకుఁ గారణ మొక్కటే తోఁచుచున్నది.

ఈ కుక్కుటేశ్వరశతక మకుట నిర్మాణము క్రీ.శ. 1715 నాఁటి కే (వెలువడిన) తన రుక్మిణీపరిణయములోనే కవి చేసినాఁడు. ఆనాటినుండి తన యవసానదశ వఱకు స్వానుభవములోని విషయములను బురస్కరించుకొని యప్పుడప్పుడు తనకుఁ దోఁచిన భావములతో 92 పద్యములనే వ్రాయఁగలిగినాఁడు. తక్కిన 8 పద్యములు పూరించులోపలనే యతఁడు మరణించియుండవచ్చును. ఈ నిర్ణయమును దృఢపఱచు నంశములు కుక్కుటేశ్వరశతకములోనే కనఁబడుచున్నవి. అందులో 89వ పద్యము-

“నోరు చేఁదై కూడుకూరలు చవిదప్పు, గడగడ నొడలెల్ల వడఁకుచుండుఁ,
జెవుడున నేమియుఁ జెవులకు వినరాదు, తెగులును జింతయుఁ దగులుకొనును,
కన్నులఁ బొఱగప్పి కానరాదెద్దియు, సిగ్గొకించుకయైనఁ జేరబోదు;
బాలురందఱుఁ గూడి గేలి గావింతురు, మగువలు పకపక నగుచునుంద్రు
మదిఁ దలంపఁగఁ గటకటా! ముదిమి యంత రోఁత లేదుగదా, ధారుణీతలమున”