పుట:కాశీమజిలీకథలు -09.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ఓసి! మీ యేలిక దుందుభి క్షేమముగా నుండిరా? కొడుకు, కూఁతురు నెందుఁబోయిరి! ఇప్పుడాయన యేమిచేయుచున్నారు. అని యడిగిన నబ్బోయెపైదలి యిట్లనియె. తల్లీ! ఆయన అడవినుండి మొన్ననే వచ్చిరి. కొడుకు నెవ్వరో కట్టిపెట్టిరఁట. వానిపైఁ గత్తికట్టి మూఁకలతో బోవుచున్నారు. కూఁతురుజాడ తెలియలేదు. గుఱ్ఱములెక్కి పోవుచునొక పెద్దబిల్లుని సహాయమిచ్చినన్నిందుఁ బంపితిరని చెప్పినది. దానికి నూత్నాంబరమాల్యను లేపనాదు లొసంగి సత్కరించుచు నీ వీదిన మిందుండుము. మీ దుందుభి కుమారుఁ డిందేయున్నవాఁడు నీకు జూపింతుమని పలుకుచు భోజనాది సత్క్రియలు దీర్పఁ బరిచారికల నియమించి తానాబక్షిని పంజరమునుండి పైకిందీసి చేతిపై నెక్కించుకొని ముద్దాడుచు విహంగమ లలామా! నీ యంగనం జూడవచ్చితివా? పాపమిన్ని నాళ్ళీ వియోగమెట్లు సహించితివో కదా! నేడు మంచిలగ్నము గాదు. రేపే నీ పత్నితోఁ గూర్చెద నీలోపల నాకు వింతకథఁ జెప్పుము నీభార్య కొంతకథఁ జెప్పి తరువాయికథ తనకు రాకున్నది తద్కథావిశేషము వినుటకుఁ జాల నుత్సాహముగా నున్నది. మంచి గానముపాడి వేడుక గలుగఁ జేయుమని యడిగిన నన్నీడజంబు మధురస్వరంబున కల్పలతా! మాకు వేనవేలు కథలువచ్చును. నా భార్య నీకే కథచెప్పినదో తెలుపుము. ఎఱింగిన వినరింతు ననుటయు రాజపుత్రిక యిట్లనియె.

దేవలోకములో నచ్చర లొకప్పుడు శృంగారకళారహస్య నేతృత్వంబున నలకూబరుఁ డధికుండని కొందఱు జయంతుఁ డధికుండని కొందఱు వాదించి తగవులాడి కల్పవృక్షకోటరమున వసించు పారావత శకుంతముల మధ్యవర్తులుఁగా గోరి కొనిరి. వాని నడిగిన మూఁడు మాసములు గడువుకోరినది ఇంతవఱకు వింటిమి. తదనంతర రోదంత మెఱింగింపుమని యడుగుటయు నవ్విహంగమం బోహో! ఆ కథయా? వినుము.

శ్లో. పరిమళభృతో గతా శాఖావనాంకుర కోటయః
   మధురనిరుతోత్కంఠాభాజప్రియా పికపక్షీణాం
   విరళ విరళస్వేతోద్గారా వధూవదనేందవః
   ప్రసరతి మథౌ ద్రాత్యాం జాతో నకస్య గులోదయః.

మలయమారుతంబులు పరిమళమిళితంబులై శాఖోపశాఖలు నూత్నపల్లవాంకురశోభితములై వధూవదనంబులు విరళశ్రమజలబిందుసుందరంబులై పికవధూకంఠంబులు మధురస్వరోపేతములై యొప్పుచుండ సకలజగదానందకందళంబగు నొక వసంతకాలంబున నలకూబరుండు రంభాసహితుండై నందనవనంబున కరుదెంచి యందందు విహారించుచు నొకలతాకుడుంగమున ననంగక్రీడాపరతంత్రుండై నర్మలాపంబు లాడుచు శృంగారలీలావైదగ్ధ్యంబు దెల్లముగాఁగ —