పుట:కాశీమజిలీకథలు -09.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

లని సామాన్యముగా జెప్పితిని. వారెట్టి యందమైనవారో యెఱుంగుదువా? చూచినంతనే పురుషుని మోహసముద్రములో ముంపగలరు. అందఱు చీనిచీనాంబరములు ధరించినవారే. అందరు నవరత్నఘటితకుండనములు దాల్చినవారే. అందఱకు భుజకీర్తులు నందఱకుఁ గిరీటములవంటి శిరోభూషణములే. ఎవ్వతెం జూచినను గన్నులకు మిరుమిట్లు గొల్పుచుండును. వారు వారు చేయు పనులంబట్టి సేవ్య సేవక తారతమ్యంబులు దెలియఁబడుచున్నవి. కాని యందున్న స్త్రీ లందఱు సౌందర్యవంతులే. నేనట్టి వైభవ మనుభవింపుచు నే నేసుకృతము జేయకున్నను మహాపుణ్యాత్ముల భోగములనుభవింపుచుంటి. కానిమ్ము . ఇట్టిభోగ మొక్క దివస మనుభవించినఁ జాలదా? పోనిమ్ము. ఇంద్రుఁడు నన్ను తరువాత శిక్షించిన శిక్షింపనీ? ఇదియే చాలునని సంతసించుచు నా నృత్యగానవినోదములు చూచుచుంటిని.

ఆ వీణాగాన మాలించినంత మనసు నీరైపోయి యేదియో యపూర్వమగు నుల్లాసము గలుగుచుండును. అట్టి వైభవముతో నన్నూరేగింపుచు నందలి పెద్దసౌధము చెంతకుఁ దీసికొని పోయిరి. విమన మాగినతోడనే పరిచారికలు వచ్చి గొడుగులు పట్టువారును పాదుకలు దొడుగువారును వింజామరలు విసరువారును హారతు లిచ్చువారునై సేవించుచుండ నేనా వేదండగమన చేయి పట్టుకొని పెండ్లికొడుకువలె నా యింటిలోనికిఁ బోయి యొక సభాభవనంబునం గూర్చుంటిని. ప్రక్కపీఠముపైఁ దీర్థశుల్క వసించినది. తత్సభాభవన ప్రభావిశేషంబుల వర్ణింప నూరునంవత్సరములు చాలవు. నవరత్నములు మలచి నాపరాళ్ళవలే నేలం బరచిరి. గోడల నిటికలవలెఁగట్టి యద్ధములవలె నమరించిరి. మీఁద బల్లవలె స్థాపించిరి. పెక్కేలఁ భూలోకము నందున్న యైశర్వమంతయు దానిలో నొక యద్ధముగా నమరించిన వజ్రమునకు సరికాదు. తద్రత్నప్రభాకిమ్మీరకాంతిపుంజములు సభాంతరాళమునఁ బుష్పమంజరుల వలె మెఱయుచుండును. మేమందు గూర్చుండ గంధర్వులు కొంతసేపు మనోహరవల్లకీగానవిశేషముల వెలయించి మమ్మానందింపఁ జేసిరి. కొంతసేపు అప్పరసలు నాట్యముఁజేసిరి. పిమ్మటఁ గిన్నరులోక ప్రహసనమాడి కడుపు లుబ్బులాగున మమ్ము నవ్వింపజేసిరి.

ఒక వైద్యశాలయందు భిషక్ప్రవరుండు పీఠముపై గూర్చుండియుండఁ బెక్కు వికారములగు రోగములు గలవారు వచ్చి మందులు గోరుట, కాళ్ళును జేతులును విరిగినవారు కట్టులు కట్టించుకొనుట, మూర్చలు పిచ్చలు పిశాచవేశము లోనగు వికృతామయగ్రస్థుల యభినయము, మాతాపితృభ్రాతృసుత ప్రముఖులు మృతినొంది నప్పుడు తత్బంధువులు చుట్టును జేరి విలపించుట, భర్తృవియోగమున స్త్రీలకుగావించు శిరోముండనములు, బంధువుల పరామర్శనము, మొదలగు భూలోక దుఃఖములన్నియు జరుగుచున్నట్లే ప్రదర్శించిరి. అవి యన్నియు మనమఱిఁగిన వైనను వారు ప్రదర్శించునపుడు క్రొత్తవానివలె పుట్టించినవి.