పుట:కాశీమజిలీకథలు -09.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుందుభి కథ

15

జెప్పకపోయిరి. ఇంతకు మున్నిట్టిదానిం జూచినవారు లేరు. ఒకనాఁడు సాయంకాలమున వింధ్యపాదంబున నొక చూతపోతము కొమ్మపై వసించి రెండు పక్షులు మనోహరస్వరంబున సంగీతము పాడుచుండెను. దేవత లెవ్వరో వచ్చి పాడుచున్నారనుకొని మేమా ప్రాంతములకుఁబోయి చూచితిమి. పతత్రములని తెలిసికొని మెల్లగా నుచ్చు లొగ్గించి వలలం బన్ని యతిప్రయత్నముతో నీపిట్టం బట్టుకొంటిమి. రెండవది పారిపోయినది. దానికొఱకుఁ బదిదినము లా యరణ్యము లన్నియు వెదకించితిని. దొరకినదికాదు. పట్టువడినది మొద లీపిట్ట మౌనముద్ర వహించినది. ఎన్నడైన నాఁడు పాడిన పాట పాడునని పరిశీలించుచుంటిమి. ఏమియు మాటాడదు. రెండు మూడు దినము లాహారము గుడిచినదికాదు. ఇప్పుడు తినుచున్నది. ఇదియే దీని వృత్తాంతమని యెఱింగించిన శ్రమణి యిట్లనియె.

తండ్రీ! దీని నేను బెంచుకొని మాటలాడించెద నెవ్వరికి నమ్మఁగూడదు. కల్పలత దీనకెంత సొమ్మిచ్చినను నమ్మనీయనని పలికిన నవ్వుచు దుందుభి కల్పలత యెవ్వతె! ఈ పతంగము తెఱం గదియే యెఱుంగునని యడిగిన రాజవాహనుఁడు కల్పలత యన వసుపాలుని కూఁతురు. ఆమెకుఁ బక్షిజాతులయందుఁ జాలప్రీతియఁట. వింతశకుంతమున కెంతసొమ్మైన నిచ్చి కొనునట. ఆమె పరిజనులు మీ రూరలేనప్పుడు వచ్చిరి. తిరుగాఁ బది దినములలో రమ్మంటిమి. అందుల కాబోఁటి కమ్మెదరేమోయని యనుచున్నదని చెప్పిన విని దుందుభి పుత్రికం గౌగలించుకొని ముద్దుపెట్టుకొనుచు తల్లీ! నీకంటె నాకా వాల్గంటి యెక్కువదియా! ఈ పక్షిని నీవే పెంచుకొనుము. అన్నయ్యకుగూడ నియ్యకుమని పలుకుచు నప్పుడే దాని బంగారుపంజరమునఁబెట్టించి శ్రమణి గృహంబున కంపెను.

పుళిందకన్యకయుఁ దన నెలవునకుఁబోయి యా పంజర మంతయుఁ దోమించి యా పిట్టను వేడినీళ్ళతోఁ గడిగి తడియొత్తి పొగవైచి దృష్టిదీసి మంచిఫలముల దినిపించి ముద్దు పెట్టుకొనుచుఁ బతంగపుంగవా! ఒక్క పలుకు పలుకుము. నీ స్వరమున మిక్కిలి మాధుర్యము గలదని వింటిమి. ఏదీ, ఏదీ పలుకుము. నిన్ను నా బిడ్డగాఁ జూచికొనియెద నెవ్వరికి నమ్మనీయను. దైవముతోడు. మాటాడుము అని బ్రతిమాలికొనియెను.

అప్పుడా వికిరవరము కుడిచరణ మెత్తి బాలా! నీ లాలన వలన నాకుఁ జాలసంతసము కలిగినది. మీరు కిరాతులు. హింసింతురని యంతదనుక మౌనము వహించి నుంటి. నీ చర్యలు పరీక్షించితిని. మీ రుత్తమజాతివారు కారణజన్ములు. మనిషి దా పాదపము జూసి ..రానంద మాపాదించుచుండెదంగాక. నాకు సమస్తభాషలు వచ్చును. నింగితములో నే నెఱుంగనిరహస్యములు లేవు. నాకు బురాణగాథలన్నియుఁ గంఠస్థములై యున్నవి. నేది నీ కభిరుచియో దానిం జెప్పుచు సంతోషము గలుగఁ జేసెదను. అని యుపన్యసించిన ఆమె బ్రహ్మానందముఁ జెందుచు