పుట:కాశీమజిలీకథలు -02.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సునందకథ

253

చిన విశేషములు వింటివా! ధర్మపాలుని పత్నియైన సునంద నెవ్వరైన దీసికొని వచ్చినచో నూరకోట్ల బంగార మిత్తునని యదృష్టదీపమహారాజుగారు ప్రకటించిరట. ఆమె మనకు దొరకిన మన దరిద్రము దీరునుగదా. అనగా మరియొక బ్రాహ్మణుడు మన కంత మాత్ర మదృష్టము పట్టునా? ఆమె పోలిక యెట్లుండునో చెప్పిరా? అన మరియొకడు పేరును బట్టియే యూహింపవలయును. నాకామె గనంబడినచో నీ స్వామికి లక్షపత్రిపూజ జేయింతుననియె. వేరొకడు సత్యనారాయణవ్రతము. ఇంకొకడు దీపారాధన. ఈ రీతి నందరును మ్రొక్క మొదలు పెట్టె.

ఆ మాటలు నేను విని సంశయమందుచు నాయదృష్టదీపునికి నా యవసర మేల వచ్చె? అతడు నా కొమరుండు కాడుగద? నాకంత యదృష్టము పట్టునా? ఇతరులకు నా పని యేమి? అంత విత్తము కరుచుపెట్టనేల? అని యాలోచింపుచుండ సవ్యబాహువును నేత్రమును దౌడయు నదరినది. ఆ శకునములు గ్రహింపుచు సంతోషముతో నుండి యా బ్రాహ్మణుల దీనాలాపములు నాకు సంతాపము గలుగజేయు చుండ నందులో నొక వృద్ధబ్రాహ్మణుని జీరి యిట్లంటి. అయ్యా! తమరిట్లు సునంద కొరకు బరితాప మొందుచున్నారు. ఆమెతో మీకేమి ప్రయోజనమున్నది. ఆమె యున్న జాడ నేనెఱుంగుదును రేపువచ్చిన జెప్పెద ననుటయు నా మాట విని యందరు చుట్టుకొని చెప్పుము, చెప్పుమని ప్రార్థింప దొడంగిరి.

నేనును రేపు వచ్చిన జెప్పెదనంటిని నన్ను బిచ్చదానిగా గుర్తెఱింగిన వారందుండుట జేసి యిస్సిరో! ఇది వెర్రిది దీని మాటలు నమ్మి తిరుగ వచ్చితిమి. రండు పోదమని అందరు నవ్వుచు బోయిరి. ఈ బ్రాహ్మణుడు మాత్రము నన్ను విడువక అమ్మా! నేను మిక్కిలి దరిద్రుడను కుటుంబము పెద్దది. పోషింపలేక కడు చిక్కులు పడుచుంటిని. నన్ను రక్షించి యామె యున్న జాడ జెప్పుమని యారాత్రి యింటికిబోక నన్ను వేడుకొనుచుండెను. అప్పుడు నాకు జాలివొడముటచే నెన్నియో మాటలు సెప్పి చివరకు నేనే సునందనని జెప్పితిని. మొదట నమ్మలేదు కాని యతడు నా చరిత్రమంతయు జెప్పినంత సంతోషింపుచు నెవ్వరికిని జెప్పక యారాత్రియే ప్రయాణముజేసి యిచ్చటికి దీసికొనివచ్చెను. ఇదియే నా వృత్తాంతము. ఈ విప్రునకు మీరిత్తుమన్న ధన మియ్యవలయునని పలుకుచు మగని గురించి విచారింపదొడంగినది.

అప్పు డదృష్టదీపు డామె నోదార్చుచు నాబ్రాహ్మణునికి నూరుకోట్ల ధనమిచ్చి మరియు నాసంతోషముతో ననేకదానములుచేసి మిగుల వేడుకతో నాదినము