పుట:కాశీమజిలీకథలు -02.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

195

అప్పుడు చతురిక కొంతదూరముపోయి మరలవచ్చి అమ్మా! ఆ తోటలోనికి పోవుటకు రాజశాసనము లేకున్న వీలుపడదు. నేను మరచిపోయి వెళ్లుచుంటిని. అయ్యగారు సాయంకాలమున నట్టిశాసనము చేసియున్నారు. కావున నట్లుపోవుటకు నాకొక చీటి నిప్పింపుమని యడిగెను. ఆ మాట విని రాజపత్ని యాక్షేపించుచు ఓసీ! నీకును శాసనము కావలయునే యూరక యాలస్యమగుచున్నది, త్వరగా వెళ్ళుమనుటయు నది సమ్మతింపక యట్టి పత్రిక యిప్పింపకతీరదని చెప్పెను.

అప్పుడు రాజపత్ని వల్లభునితో నామాట జెప్పగా నతండంత విమర్శింపక యీకాంతనుమాత్రము లోనికి పోనీయుడని చీటివ్రాసి యిచ్చెను. అట్టి శాసనపత్రికం గైకొని యచ్చతురిక మిక్కిలి సంతోషించుచు యంత్రప్రదీప్తహస్తయై వడిగా నత్తోట యొద్దకుబోయి ద్వారపాలురతో గోటలోజరిగిన యుపద్రవము చెప్పుచు నచ్చీటిని వారికి జూపి లోనికి బోయినది

ఆహా! దాని బుద్ధినైపుణ్య మెంతవింతయైనదో చూడుము. అట్లు లోనికి పోయి యాదీపము వెల్తురున నత్తోటలో నలుమూలలు దిరుగుచు నొక మేడగోడప్రక్కను సోపానముమీద గూర్చుండి తన యవస్థగురించి విచారించుచున్న యదృష్టదీపునింగాంచి తన్నెరింగించి యతనికొరకు రాజపుత్రిక పడుచున్న యిడుమలన్నియు దెలిపిన నతండును కాంతిమతికి దనయందుగల మక్కువను గురించి మిక్కిలి మెచ్చుకొనియెను.

తరువాత నచ్చతురిక తానుదెచ్చిన బట్టలతనికి గట్టనిచ్చి స్త్రీ పురుషభేదము దెలియకుండునటుల మేలిముసుగుగప్పి యా చీటి నతనికిచ్చి దీపము జేతంబట్టుకొని యాదారిం బొమ్మని చెప్పినది అతడట్టి వేషముతో బోవుచు దారిలోనున్న ద్వారపాలుర కాచీటిం జూపింపగా వాండ్రు మొదట వెళ్ళిన చిన్నదియే యనుకొని యంతగా బరీక్షింపక దానిని విడిచిపెట్టిరి. దానంజేసి యతండు నిరాటంకముగా నింటికిబోయి తన రాకకు వేచియున్న బలభద్రునకా వృత్తాంతమంతయుంజెప్పి యా రాత్రి సుఖముగా వెళ్ళించెను.

అంత నచ్చట దోటలోకి జతురికయు మరికొంతసేపుండి యెద్దియో యొక వేరు త్రవ్వుకొని మొదటనే ప్రచ్ఛన్నముగా దెచ్చిన దీపమును వెలిగించుకొనుచు నా దారింబోవునంతలో ద్వారరక్షకు లడ్డమువచ్చి నీ వెవ్వతెవు! యీ తోటలోని కెటుల పోయితివి. నీవిపుడు పోవలదు నిలువుమని పలుకగా నది నవ్వుచు నోహో మీరు గట్టి శూరులే! నే నిప్పుడు మీకు జీటిజూపి లోనికిబోలేదా? ఆ చీటీ నెచ్చటనో మరచిపోయితిని. నేను నిత్యము వచ్చుచున్నదాననే. కాంతిమతి స్నేహితురాలను. ఆ చిన్నది యిప్పుడు పాము గఱచి చచ్చుటకు సిద్ధముగా నున్నది. ఈ వేరుకొరకు నిచ్చటకు వచ్చితిని. వేగముగా తీసికొనిపోవలయును. లేనిచో రాజపుత్రిక జీవింపదు. రాజుగారు నాపయి గోపము చేయుదురు. నా పేరు చతురిక. నా సంగతి ప్రొద్దున రాజుగారితో జెప్పుడు. వేగము పోనీయుడని చెప్పగా వారు నీ వెవ్వతెవైనను మాకు భయములేదు. నీ మాటలు