పుట:కాశీమజిలీకథలు -02.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

193

పోవుటకు శంకించుచు నటునిటు కొంతసేపు తిప్పినది. కాని యతండచ్చట నిలువక తిన్నగా నయ్యంతఃపురమునకు బోయెను. అక్కాంతిమతియు నప్పుడు శృంగారవేషము తీసివేయు విషయమై సవరించుకొనుచున్నది. గావున దండ్రిని జూచినతోడనే దద్దరిల్లుచు దెల్లబోయి నిలువంబడినది.

అప్పుడు గదిలోనున్న పరిమళవస్తువిశేషములన్నియు జూచి శంకించుకొనుచు బ్రత్యక్షముగా జూచిగాని యడుగరాదని నిశ్చయించి యా మేడనంతయు వెదకెను. ఎచ్చట నెవ్వరు గనంబడలేదు. కాంతిమతి యాకృతిజూడ వేరొకరీతి గనంబడినది. మొగమునంగల దంతనఖచిహ్నములే సంభోగసూచన సేయుచున్నవి. కాని కూతురు కావున దాపునకుబోయి యంతగా బరీక్షించుటకు వీలుపడినదికాదు. అయ్యెడయుం డయ్యువతిని సంభోగవతిగా నిశ్చయించి కానిమ్ము. ఆ పురుషుం డిత్తోట నెచ్చటనో దాగియున్నవాడు. నేడు చీకటి పడినది. ఱేపువచ్చి వెదకించి పట్టుకొని శిక్షించెదంగాక యని నిశ్చయించుచు గాంతిమతింజూచి చిరంజీవినీ! నీవింత స్వతంత్రురాలి వైతివేమి? కోటవిడిచి యింతరాత్రివరకు నిచ్చట నొంటరిగా నుండవచ్చునా? పో పొమ్ము . పిమ్మట జెప్పెదనని పలికిన నులికిపడుచు నత్తరుణి మరుమాట పలుకక యప్పుడే చతురికతో గూడ మేడవదలి బండియెక్కి మిర్రునకుంబోవు ప్రవాహమువలె నంతఃపురమునకు బోయినది. ప్రాణములన్నియు నుద్యానవనములోనే యున్నవి

పిమ్మట నయ్యనంతవర్మయు గొంతసే పాప్రాంతభాగముల నరసి చీకటిలో నేమియు గనంబడమి మరలి ద్వారము దాపునకు వచ్చి యీరాత్రి మా సెలవులేక నీ తోటలోనుండి యెవ్వరికిని రాకపోకలు జరుగనీయగూడదు. అట్టిపని జరుగనిచ్చితిరేని మిమ్ము గఠినముగా శిక్షింతునని ద్వారరక్షకుల కాజ్ఞాపించి కోటలోనికిం బోయెను. ఆ వార్త దూతికాముఖంబున గాంతిమతి విని మిక్కిలి పరితపించుచు జతురికంజూచి, సఖీమణీ! నేనేమి చేయుదును. రాజుగారి శాసనము వింటివా? ఉదయమునబోయి నా మనోహరుని బట్టుకొని శిక్షింతురు కాబోలు. అయ్యో! ఆ తోటకు రెండవదారిగూడ లేదే? ఈ దివసముతో నా యాయుర్దాయము సరిపడినది. వారికేమాత్రము ప్రమాదము సంభవించినను నేను బ్రతుకనని నమ్ముము.

పోనీ మా తల్లితో యదార్ధముచెప్పిన నీ యాపద దప్పించునేమో! యేమనియెదవు ఇంతయేల! గాంధర్వవివాహంబున నతనిని బరిగ్రహించితినని మా తండ్రితో చెప్పుదునా! నీవు మిగుల బుద్ధిమంతురాలవు. ఉపాయమేదియో యాలోచింపుడు నే నెంతకఠినురాలనోకదా? నా ప్రియుండటుల భయార్తుండై చీకటిలో ముండ్లకంపలో దాగియుండ నే నిచ్చటికి వచ్చితిని ఎటులైన నీరాత్రి యా యడవిలోనుండి బయటకు