పుట:కాశీమజిలీకథలు -01.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రసేన కథ

277

చిత్రసేనకథ

అప్పు డాఁడుపక్షి మగపక్షితో రేడా! యీతోటలోఁ దిగిన వారెవ్వరవి యడిగెను. మగపక్షి తన్వీ! వీరొక దేశపు రాజకుమారులు. ఈ రాత్రి వీరిలో గామపాలుండను వానిభార్య చిత్రసేన యను చిన్నది క్రీడాలసయై నిద్రించు సమయంబున రవిక విడియున్న యామె స్తనాంతరమం దొకసర్పము విషము గ్రక్కిపోవును. అయ్యబల యొత్తిగిలినంత పాలిండ్లం గల నఖక్షతరక్తమ్మునఁ గలిసి యా విషము తలకెక్కి యక్కలికి ప్రాణంబులం బాయునని చెప్పి యప్పతంగం బంగనతోగూడ నెగిరి యెందేనిం బోయెను.

బుద్దిసాగరుఁ డా పక్షి వాక్యంబులు విని మరల చింత వహించి దానిం దప్పించు నుపాయము వెదకుచు నొరుల కెఱింగించిన వారు రాయి యగుదురను మాట వినుటచే నవ్విధం బెవ్వరికిం జెప్పక యారాత్రి యెట్లో వారా ప్రాంతముననే పండుకొని నిద్రింపక యా సాము రాక కెదురుజూచుచుండెను.

అంత నర్దరాత్ర సమయంబున విచిత్రపటకుటీరములో రతిక్రీడావసులై చిత్రసేనాకామపాలురు గాడనిద్రజెందియుండ నొక కుండలి భూవివరంబునుండి పైకివచ్చి బుసకొట్టుచు నట్టట్టె యా చిత్రసేన స్తనాంతరమందు విషముగ్రక్కి వచ్చినదారింబట్టి పోయినది. ఆహా! పక్షివాక్య మెంత సత్యమైనదో చూడుము. అప్పుడు బుద్ధిసాగరుఁడు మెల్లనబోయి యా పల్లవపాణి దొర్లకుండ దన నాలుకకు గుడ్డచుట్టుకొని తదీయ స్తనాంతరమందున్న విషము నద్దుచుండెను.

అప్పుడు చిత్రసేన దైవయత్నమున మేల్కొని తనచన్నులు నడుమ నాలుకచే నద్దుచుండుట దెలిసికొని యడిరిపడిలేచి యెవ్వడో నన్నుఁ బట్టుచున్న వాఁడని యరచెను. ఆ రోదనేఁ గామపాలుండు మేల్కొని యేమేమి యని యరచెను. పిమ్మట నా కొమ్మ బుద్ధిసాగరుని నానవాలుపట్టి బుద్ధిసాగరుండు దన్ను గామించి పట్టుచుండెననియు నింతలోఁ దనకు మెలకువ వచ్చినదనియుఁ జెప్పి యతని నిందింపఁ దొడగెను.

కామపాలుండు బుద్ధిసాగరుని యందుగల మైత్రిచే నేమియు ననలేదు. కోపదృష్టితో నతనిం జూచి శిరఃకంపముచేసి యతనితో మాట్లాడుట మానివేసెను . "మిత్రదండ మభాషణం" అనునట్లు స్నేహితునితో మాట్లాడకపోవుటయే శిక్ష కావున