పుట:కాశీమజిలీకథలు -01.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగల మంత్రి కథ

227

ఆరాజు వారియుపదేశము యుక్తముగా నున్నదని తలంచి మంత్రులతో విమర్శించి యప్పుడే యుద్ధయాత్రకు నాజ్ఞచేసెను. సకలసైన్యములకు నుత్సాహము కలుగునట్లు రణభేరి మ్రోగించిరి. తర్వాత గుర్రములు, నేనుఁగులు, రథములు, కాల్బలము, సారధులు మొదలగు చతురంగబలములు వారివారి యాయుధముల నలంకారములతో సిద్ధమై కోటముంగిటకువచ్చి నిలిచినవి. సేనానాయకుఁడు సైన్యముల చిత్రముగా నడిపింపఁదొడంగెను. ఆహారపదార్థములు మందుగుండుసామానులను బండ్లమీఁదను లొట్టెలమీఁద నెక్కించి నడిపింపసాగిరి. అంత శుభముహూర్తమున నారాజు భద్రగజముపై నెక్కి యుద్ధయాత్రకు వెడలెను.

అట్లు మంగళధ్వనులు జయ జయ ధ్వనులు భేరీమృదంగాది ద్వనులు భూనభోంతరాళంబునిండ భండనమునకు వెడలిన యారాజున కనేకాపశకునములైనవిగాని బలాధిక్యముగల యతని కని లెక్కకు వచ్చినవికావు. నడుమనడుమ మజిలీలు చేసి కొనుచుఁ బదిదినములకు భూరిశ్రవుని పురబాహ్యప్రదేశము జేరి యందు బలముల విడియించి చక్రవ్యూహ్యమును పన్నిరి. నడుమ ప్రభువులుండు శిబిరములును వాని చుట్టును కాల్బలము వారిపైన రథికులు వారిచుట్టును గుఱ్ఱములు వారిపైన నేనుఁగులను విధియుక్తముగా నిలఁబెట్టరి అట్టి వ్యూహాంతర మందుండి యారాజు భూరిశ్రవునికి యుద్ధాహ్వానపత్రికల వ్రాయించి దాదులచే నంపెను.

అంతకుమున్నే రణభేరీధ్వనులవిని సంశయాకులమతియైయున్న యాభూపతి యట్టిపత్రికం జూచికొని నిశ్చేష్టితుఁడై కొండొకవడికిఁ దెప్పిరిల్లి యందుల కొకదినము మితి కోరి మరల నుత్తరమును నంపెను. పిమ్మట భూరిశ్రవుఁడు మంత్రిని బిలిచి యాయుత్తరము జూపి కర్తవ్య మెద్దియో చింతింపుమని పలికెను.

_________

మంగలమంత్రి కథ

అప్పు డయ్యమాత్యుఁడు పండ్లు పటపట గొరుకుచు రాజుతో నిట్లనియె. రాజా! యుక్తాయుక్తములు నరయక నుద్యోగము లిచ్చు రాజు ఆపదలఁ బొందకుండునా? పూర్వము నీవంటిరాజే యొకఁడు బాగుగా క్షౌరము జేయు మంగలివాని మెచ్చుకొని, యేమి కావలయునని యడిగిన వాఁడు తనకుఁ దగినదానిని గోరక మంత్రిత్వ