పుట:కాశీమజిలీకథలు -01.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గోపా! యేమి చెప్పుదును. అంతలోనే శత్రుంజయుని యింటను మాయవనిత వేషముతోనున్న రక్కసి నిజరూపము ధరించి బ్రహ్మాండకరండము పగులనార్చుచు నెగసి సింహదమనుని దాపునకు రాఁబోయెను. మొదటనే కాళ్ళు విరచెనుగాన నొకచోట కాళ్ళును నొకచోటఁ జేతులును విరిగి పడిపోవ నతఁడు విరిచిన యట్లకచోట శిరము శరీరముతో వేరుజెందినంత నక్కంకాళి మృతినొందెను. దాని పాదముల క్రిందను జేతులక్రిందను మొండెము క్రిందను తలక్రిందనుఁబడి యనేక జీవులు మృతి నొందినవి. దాని దేహమెంత యుండునో విచారింపుము. ఆ యుత్పాతమును జూచి పౌరులందరు వెరగందుచుఁ జిట్టచివర దానికథయంతయు విని సింహదమనుని మిగుల వినుతించిరి.

యజ్ఞదత్తుఁడు మొదలగువీరులు పెక్కండ్రువచ్చి దానియంగములన్నియు పెద్దకఠారులచే ముక్కలక్రింద నరికి దహనము చేయించిరి. తలమాత్రము నరుకుటకు లొంగినదికాదు. దాని బెక్కండ్రు గొప్పసాధనముచే నూరిబై టనున్న యడవిలోనికి బెద్దకాలమునకు దొర్లించిరి. శత్రుంజయుఁడు సకలపరివారసహితముగాఁ గోటలోనికిఁ దీసికొనిపోయి శుభముహూర్తమునఁ బుత్రునకుఁ పట్టాభిషేకముచేసి తాను తపోవనమున కరిగెను. యజ్ఞదత్తుఁడు కొన్ని దినములుండి మరల మాతామహుని రాజ్యము సేయ నరిగెను. సింహదమనుండు కాంచనమాలనుగూడ రప్పించి మువ్వుర భార్యలతో యథేష్టకామంబుల ననుభవించుచుఁ బెద్దకాలము రాజ్యముచేసెను.

గోపా! నీవు చూచిన పుఱ్ఱె యారక్కసిది. చిరకాలమైనది . కావున మేదో మాంసములు హరించినవి. దాని గొప్ప యిప్పుడేమి యున్నది? దాని మేదోమాంసము లున్నప్పుడు చూచితీరవలయును. మార్గస్థులు దానింజూచి పర్వత మేయని పెక్కుదినముల వరకు భ్రాంతిపడుచుండిరి. ఇదియే దాని వృత్తాంతము. నిస్సంశయముగాఁ దెలిసినదికదా? యని యడిగిన వాఁడు స్వామీ! మీ కటాక్షమున నంతయుఁ దేటగాఁ దెలిసినది. కథ నాకు మిగుల సంతసము గలుగఁజేసినది. ఇట్లు చెప్ప మీకుగాక యన్యులకు శక్యమా యని యయ్యతీశ్వరుని బెక్కుగతులఁ గొనియాడెను.

అంతలో ప్రయాణసమయమైన నాగొల్లవాఁడును యతీశ్వరుఁడును నప్పురంబు వెడలి మార్గంబు వెడలి మార్గంబునంబడి నడుచుచు గ్రమంబున పదియవ మజిలీ చేరిరి—

పదియవ మజిలీ

సోమశర్మ కథ

పదియవ మజిలీ, యొక రాజధానిగానున్నది. వారిరువురు నతి విశాలంబగు నా పట్టణపువీథిం బడి బోవుచుండ నొకచోట నడివీథిలో నినుపకంబమున నొక బ్రాహ్మణుఁడు నిలబడియున్నట్టు కనబడినది. వానింజూచి యాగోపాలుఁడు మణిసిద్ధునిఁ బైకి