పుట:కాశీమజిలీకథలు -01.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

చెను. సిరిరా మోకాలొడ్డువాఁడుఁగలడా? పిమ్మట నారాజు శుభముహూర్తంబున నధికవైభవముతోఁ గాంచనమాలను సింహదమనునికిచ్చి బెండ్లిచేసి వెంటనే రాజ్యమునకుఁ గూడ నధీశ్వరునిగాఁ జేసెను.

సింహదమనుండా దేశమున కదీశ్వరుండై న్యాయంబునఁ బ్రజలఁ బాలింపుచుఁ గాంచనమాలతోఁగూడ యధేష్టకామసుఖంబు లనుభవించుచు నతనికిఁ బూర్వస్మృతి యేమియులేక మోహినిం గాని మణిమంజరినిగాని తల్లిదండ్రులఁగాని యొకనాఁడైన స్మరింపఁడయ్యె. ధనమదులకు వెనుకటి చింత యుండదను నార్యోక్తి తప్పునా?

మోహిని కథ

గోపా! యాకథ యటుండనిమ్ము! అచటఁ జెట్టుక్రిందఁ దన మగండట్లు సింహమును తరుముకొని పోయిన వెనుక మోహిని తెల్లవారువరకు మరల నతండు వచ్చునేమోయను నాసచే నొంటిప్రాణముతో నిలిచి నలుదెసలు పరికించి చూచుచుండెను. తెల్లవారినను నతని జాడయేమియు లేదు. అప్పుడప్పఁతి గుండెపగుల నిటునటు తిరుగుచు నతఁడు పోయిన త్రోవంబట్టి కొంతదూరము పోయియు నతండొకవేళ నాచెట్టు క్రిందకువచ్చి తన్ను వెదకుచుండు నేమోయని మరల నాచెట్టు మొదలుచేరి యతనిం గానక పెద్ద యెలుంగున నోసింహదమనా! యోమనోహరా! యని యరచియు నెందును బ్రతిధ్వనిఁగానక గుండెలు బాదుకొనుచు దైవమును దూరుచుఁ దన్నుదాన నిందించుకొనుచు నరచేతఁ బ్రాణంబులు పెట్టుకొని యమ్మహారణ్యములోఁ గొంత తడవు దిరుగఁజొచ్చినది.

అప్పుడొక మూలనుండి యాయెలుంగు విని కొందరు దొంగలువచ్చి యమ్మోహనిం బట్టుకొని యొడలినున్న వస్తువులన్నియుఁ దోచుకొనియు విడువక కట్టి వైచి తమ రారాధించు నొక యమ్మవారికి బలియియ్యఁదలచి చయ్యన నచ్చటికిఁ దీసికొనిపోయిరి. అప్పుడామె గుండె రాయి చేసికొని యట్టిమగఁడే పోయినప్పుడు మరణం బెక్కుఁడా యని తెగించి నిర్భయముగా వారివెంట కటికచీకటిలో నమ్మవారి యాలయమున కరిగెను. ఆ దొంగలా యంగననట్లు అమ్మవారి గుడికిం దీసికొనిపోయి ముందు కానుకలిచ్చి యావెలఁదిని బలి యియ్యఁబోవు సమయమున వారిలో నొకఁడు తక్కినవారి కిట్లనియె.

ఓరీ ! తమ్ములారా! ఈ నారీమణి మిగుల నందకత్తెలాగున నగుపడుచున్నది. దీని నిష్కారణమేల చంపెదరు. నావంతు వచ్చిన సొమ్ము మీకు వదలివేసెదను. దీని నాకు భార్యగా నీయుఁడని యడిగెను. ఆ మాటవిని మరియొకండు అన్నా! నీవేనా? కాముకుఁడవు. నాకు మాత్రము మంచి యందముగల దానియందు వలపు గలుగదనుకొంటివా? హాయిగా దీనిం గౌఁగిట జేర్చువానికి దేవేంద్రుడై నను సాటి వచ్చునా! నీవు నీవంతు ధనం బిత్తువుగాని దీని నాకు భార్యగాఁ జేసిరేని నా పాలుకు