పుట:కాశీమజిలీకథలు -01.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

నేను పూచీయని పలికిన విని రాజును సభ్యులును వారి వివాహమును గురించి మిగుల సంతసించిరి. అంతటితో సభచాలించి యెవరి బసకు వారరిగిరి. ఆ పట్టణములోని స్త్రీ పురుషులు వారి వివాహ వృత్తాంతమంతయు విని తమబాధ తగ్గెనని తమ యిండ్లలోఁ బెండ్లియైనంత సంతోషము వహించిరి.

ఆ రాజును శుభముహూర్తమున విక్రమసింహునకు బురుషద్వేషిణి నిచ్చి యధికోత్సవముతో వివాహము గావించెను. విక్రమసింహుడును బహుశ్రుతుని మతి చమత్కృతి గురించి పెక్కుతెరంగుల గొనియాడుచు బురుషద్వేషిణితో గొంతకాల మందుఁ గ్రీడాసౌఖ్యము లనుభవించి యొక్కనాడు బ్రహుశ్రుతునిచే బోధింతుండై భార్యగూడి చతురంగబలయుక్తముగా స్వదేశంబున కరిగి నిజదర్శనాయత్తచిత్తులై యున్న తలిదండ్రుల చింత మానిపి పట్టాభిషిక్తుండై పెద్దకాలము రాజ్యసుఖంబుల ననుభవించెను. గోపా! ఈ చిత్రపట వృత్తాంతమిదియే. ఈ రూప మా పురుషద్వేషిణిది. అని యెఱింగించి యయ్యతివల్లభుండు శిష్యుఁడు చిత్తమని వెంటరా నెనిమిదవమజలీ చేరెను.

__________

ఎనిమిదవ మజిలీ

కృష్ణదేవరాయల కథ

ఎనిమిదవ మజిలీయందుఁ గోపకుమారుఁడు భోజనసామాగ్రి దెచ్చుటకై యంగడికిఁ బోవుచు నొక యింటనున్న విగ్రహమును జూచి యాశ్చర్యపడి యప్పుడే క్రమ్మర నమ్మణిసిద్ధునొద్ద కరిగి స్వామీ యొకయింటిలో ననల్పశిల్పరచనాసమన్వితం బగు నొక విగ్రహమునుఁ బొడగంటిని. అది శిలాదారుమృత్తికాదులచే రచియింపఁబడినట్లు కనంబడదు. యదార్థపు పురుషునివలె నున్నది. ప్రాణములేదు. దేవతావిగ్రహము కాదు. ఉత్సవములు చేయుచుందురు. దాని కథ యెవ్వరినడిగినను చెప్పలేదు. సర్వజ్ఞులైన మీ వలన నాకా వృత్తాంతము విన వేడురపడి వచ్చితి నెఱిగింతురే యనిన నాసిద్ధుండు నవ్వుచు నట్లనియె.

వత్సా! నీకుఁ గలలయందింత వ్యసనమేమి? యంగడికిఁ బోయినవాఁడవు వూరక రానేల సామాగ్రి దెచ్చినపిమ్మట నడిగినఁ జెప్పనా? ఈ వృత్తాంతము మిగుల చిత్రమైనది. భోజనంబైన పిమ్మట సావధానముగాఁ జెప్పవలయును. వడిగాఁబోయి