పుట:కాశీమజిలీకథలు -01.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమసింహుని కథ

131

స్వదేశాభిముఖులై యరుగుచున్నారు గోపాలా! నీవు చూచినది వారి కీలురథముసుమీ! యని యెఱింగించిన సంతసించు గొల్లవానికి వింటివా! కథ స్పష్టముగా దెలిసినదికద. వా ర ట్లరిగి తమకై కుందుచున్న తల్లిదండ్రుల కానందము గలుగఁజేసిరి.

అని యెఱింగించిన యాకథావృత్తాంతమెంతయు నాగొల్లవాడు ప్రయాణంబు సేయునప్పుడు జ్ఞాపకమునకు దెచ్చుకొనుచు నవ్వరప్రసాదుల యదృష్టమునకు మెచ్చుకొనుచుఁ గ్రమంబున నాయతీంద్రునివెంటఁ గావడి మోసికొని ముందరమజిలీ జేరెను.

ఏడవ మజిలీ

విక్రమసింహుని కథ

అది యొకపట్టణము గాన నం దొకసత్రమున బసచేసిరి. ఆసత్రము చిరకాలముక్రిందట నొకమహారాజుచే స్థాపించబడినది. అం దభ్యాగతుల కహోరాత్రంబుల నిరభ్యంతరముగా నన్నదానము చేయఁబడుచుండును. ఆసత్ర మందిరసింహద్వారోపరిభాగంబున వ్రేలఁగట్టఁబడి యున్న చిత్రఫలకములోని స్త్రీరూపమును జూచి తదీయసౌందర్యాతిశయమునకు వెరగుపడుచు నాజవ్వని యెవ్వతె? అం దేల వ్రేలగట్టఁబడినది? తద్వృత్తాంతం బెఱింగింపుఁడని యడిగిన గోపకుమారునకు మణిసిద్ధుండు తదుదంతం బారత్నప్రభావమునం దెలిసికొని యక్కథ జెప్పందొడంగెను.

చోళదేశంబునం బ్రజావతి యను పట్టణంబునఁ జిత్రసేనుండను రాజు గలఁడు. అనపత్యుండగు నారాజు శ్రుతకీర్తి యను మంత్రితో న్యాయమార్గంబునఁ బ్రజాపాలనంబు సేయుచుండఁ బెద్దకాలమున కతనికి నొకపుత్రుం డుదయించెను. జననలగ్నమును బట్టి వానికి విక్రమసింహుఁ డని పేరుపెట్టిరి. ఆవిక్రమసింహుఁ డుదయించిన మూఁడవదినముననే యారాజు మంత్రియగు శ్రుతకీర్తికి నధికతేజస్సమంచితుండగు సూనుం డుదయించెను వానికిని దైవజ్ఞులు బహుశ్రుతుఁడను నామధేయ ముంచిరి.

ఆబాలుర కైదేఁడులు వచ్చినతోడనే సకలవిద్యాపరిపూర్ణుఁడగు నొకయుపాధ్యాయునొద్ద జదువవేసిరి. వా రాయాచార్యునివలన బదియారేఁడులప్రాయములోపలనే సకలవిద్యలు గ్రహించుటయేగాక ధనుర్విద్యయం దసమానప్రజ్ఞ గలవారైరి. మరియు సంగీతమునందును గవిత్వమునందును వారిం జెప్పియే మరియొకరిం జెప్పవలయును.

చిన్నప్రాయములోనే యెక్కుడు పాండిత్యము సంపాదించిన యాకుమారుల