పుట:కాశీమజిలీకథలు -01.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

91

నాల్గవ మజిలీ

ప్రవరుని కథ

గోపా! అడవిలో మఱ్ఱిమ్రాను పడమటికొమ్మ యెక్కి యరిగిన విప్రకుమారుడు ప్రవరుడు మూడుదినములు దానిమీద నడచినంత నాశాఖాంతము గాన్పించినది. అతం డంతటితో యాగక మితియున్నందున నిందేవేని వింతలుండకపోవు. కొంతదూర మరిగి చూసెదంగాక యని శాఖ దిగి యడవిగానున్న యచ్చోట సన్ననిదారి యొకటి గానంబడుటయు దానింబడి నడువసాగెను. కొంతదూర మరిగిన నచ్చట కొందరు విచ్చుకత్తులతో ముచ్చులెదురై యతనియొద్దనున్న మణికనకవస్తుసమితి నంతయు దోచుకొనుటయేగాక విలువగల కట్టుబట్టలుకూడ నూడదీసికొని తమ మురికిగుడ్డ లతనికి గట్టనిచ్చి యథేచ్చం జనిరి.

దొంగలు తన్ను దోచికొనినందుల కించుకయేవి చింతింపక యతండు సంతోషముతో నరుగుచు సాయంకాలమున కొకపట్టణము జేరెను. ఆ దిన మమావాస్య యగుట రాత్రి మిగుల జీకటిగానున్నది. అందు భోజనసదుపాయము జేయు బ్రాహ్మణగృహ మెందున్నదో దెలిసికొనలేక నాలుగువీథులు తిరుగగ నా పట్టణపు రాజుగారి కోటకు బడమరదెస నున్న గుఱ్ఱములసాల యొకటి గానంబడినది ప్రవరుం డం దొకవేదికం జూచి పయికి నడువలేక యాదినమున జాలబడలియున్నకతంబున దానిమీద బండుకొని గాఢముగా నిద్రబోయెను .

నిద్రాసక్తులు శయ్యాసుఖంబుల గణింతురా? అట్టి నిద్రయు నొకజాము పట్టినది. ఆకలిగా నుండుటచే బిమ్మట మెలకువ వచ్చినది. అప్పు డతం డెద్దియో ధ్యానించుచు నూరకయే పండుకొని యుండెను.

ఇట్లుండగా నా కోటమీదుగా గలగల యను ధ్వని యొకటి వినంబడినది. దాని కతండు బెదిరి యది యేమో యని యాదెస బరిశీలింపుచుండ నాగోడపైనుండి యొకయినుపగొలుసు క్రిందికి వ్రేలవేయబడినది మిగుల నద్బుతపడుచు దత్కారణ మరయుచుండ నందుండి తొలకరిమెరపువలె నక్కటికిచీకటిలో దళ్కురని మెయిదీగ మెరయ బదియారేడులప్రాయముగల యొకముద్దుగొమ్మ చరచరం దిగి నచట కానంబడిన నతం డచ్చెరువందుచు నోహో! యింత సోయగముగల యబల యెవ్వని వలచి యిట్లు దిగివచ్చుచున్నదో చూచెదగాక యని కన్నులు మూయక నిద్రబోవువానివలె గుఱ్ఱు పెట్టుచుండెను.