పుట:కాశీమజిలీకథలు-12.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యతిధిని యుచితరీతిని సత్కరింపక యిట్టువిరసోక్తులాడుట పాడిగాదని తక్కినవారు పలికిరి.

ఇంతలో నొక పరిచారిక పరుగుపరుగునవచ్చి యమ్మనేజల్ల! ఎంతదారుణ సంగ్రామమెంతలోఁ జల్లారెను! కుబేరనలకూబరులిప్పట్టున రాకున్న నీయక్షకులం బంతయు నీయకారణ సంగరమువలన నిర్మూలము. గావలసినదేగదా? దైవానుగ్రహ మున యక్షులందరు యుద్ధవిముఖులై నిజనివాసములకేతెంచుచున్నారు వారని చెప్పెను.

చిత్ర --- యుద్ధకారణమేమో యిప్పటికైనఁ దెలిసినదా!

పరి - ఏమియును దెలియలేదు. కుబేరనలకూబరులు స్వర్గపురమునుండి విమానముమీద నిజనివాసమున కేతెంచి యీ దారుణ సంగ్రామముజంచి యాదండ కరిగి యందున్న వీరవరేణ్యులఁ బేరుపేరునఁ బిలచి యుద్ధకారణమడిగిరఁట ! ఎవరికి వారే మేమెరుఁగమన్నవారేగాని దీనిమూల మిదియని చెప్పిన వాడొక్కడునుఁ గనం బడలేఁదట. దానికి వారు వెరఁగుపడుచు మరియు విమర్శింప మీ‌యన్న మణిగ్రీవుం డును జలంధరుండును నందులకు మూలమని తెలిసినదఁట. వారిరువురఁబిలచి యెంత యడిగినను సరియైన సమాధానము చెప్పలేదఁట.

దివో - మణిగ్రీవుఁడు మీ గుణవతి సోదరుఁడా ? జలంధరునితో వానికిఁ కలిగిన కలహకారణము నేఁజెప్పగలను.

అనం - (చెప్పవలదని కనుసన్నఁ జేయును)

చిత్ర - (ఆ సన్న గ్రహించి రాజుతో) దేవా ! ఆ సంగతి చెప్పుట కనంగ మోహిని కిష్టము లేనట్లున్నది. పోనిండు. మనకిప్పుడా ప్రశంస యేమిటికి?

దివో - ఆ సంగతి మఱొకప్పుడు సవిస్తరముగాఁ జెప్పెదను. దీనికేమి గాని నాఁడు మీరు ప్రసంగించిన నరబాలక కళేబరమేమైనది. జాతి ధర్మము నను సరించి నాకు తద్వృత్తాంతము వినఁ గుతూహలముగా నున్నది అని యడుగుటయుఁ జిత్రలేఖ దరహాసిత వదనయై యిట్లనియె ధాత్రీశ్వరా ?మీ ప్రభావంబమానుషంబు. మీ బలప్రతాపధైర్యసాహసాది యుత్కృప్టగుణంబులు లోకాతీతములు మీకడ మా రహస్యంబులు దాగునా ? యని యా వృత్తాంతమంతయుం జెప్పి యా యక్షుఁ డొనరించు వ్రతదినము నేటితోఁ దీరుటచేఁ నీరాత్రియే యీ పురమున కుత్తరముగఁ గ్రోశద్వయ దూరముననున్న భైరవీదేవి యాలయంబున నా కళేబరముతో నమ్మవారి యర్చన జరుగఁగలదని గూడఁ జెప్పెను.

ఆ నరబాలక కశేబర వృత్తాంతము నెఱుంగుటకా నృప కంఠీరవుండు మనంబున సంతసించుచు ప్రకాశముగా చిత్రలేఖ కిట్లనియె.

దివో -- చిత్రలేఖా ! మీ నెచ్చెలి యావ్రత మొనర్చు వానినిఁ బరిణయ మగుట కిష్టపడుచున్నదాఁ అదియంతయును వృధాశ్రమ కాదు.