132
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
సత్వ :- వయస్యా ! మకరాంకా ! ఇం దాక నీవృత్తాంత మితండు వినఁ గోరికొనియెంగదా? నీ జన్మ భూమియేది? తలిదండ్రు లెవ్వరు? ఏమిటికిట్లు ఇల్లు వాకిలి విడిచి యొక్కఁడవు తిరుగుచుంటివి? నీవిరక్తికిఁ గారణమేమి? మర్మమువిడిచి చెప్పుము. నాడు నిన్నింత గట్టిగా నడుగలేదు గదా ?
మక :- నీవు నాహృదయబంధుండవనియే తలంచుకొంటి. నీకడ మర్మమేల చెప్పెదను వినుము. నాజన్మ భూమి విశాలాపురము. మేము నలువురము సఖులము. దేశములు చూచు తలంపుతోఁ దలిదండ్రుల మోసముఁ జేసి యిల్లు వెడలితిమి తలయొక తెరవునం బడుటచే వారిం గలిసికొనఁ దిరుగుచుంటిని.
గుప్త :- (స్వగతం) నే ననుకొనినిట్లే ఇది రూపవతియే. స్వరమువిని మొదటనే యనుమానపడితిని. అమ్మయ్య! నే డెంత సుదినము తటాలున లేచి కౌఁగలించుకొందునా? ఏమో ! నాయూహ యసత్యమైనచో మోసముగదా? (పకాశం) అయ్యా! మొదటినుండియుఁ దమపే రిదియేనా?
మక :- (స్వ) ఇది శీలవతియా యేమి? రాజబంధువుఁడని చెప్పెను. స్వరము పోలిం స్వరము లుండునేమో? నాకట్టి యదృష్టము పట్టునా? (ప) అట్ల డిగితివేల? మొదటనొక పేరును దరువాత నొక పేరును బెట్టుకొందురా యేమి?
గుప్త :- వేషభాషలు కార్యానుగుణ్యముగా బుద్ధిమంతులు మార్చుకొను చుందురని యడగతిని తప్పా?
మక :- (స్వ) ఓహో! శీలవతియే. సందేహము లేదని సంతసమున (ప్ర) నీవేమైన నట్లు మార్చితివా యేమి? నీ వృత్తాంతము మాత్రము నేను కొంచెము వినవలదా?
గుప్త :- విందువుగదా! చెప్ప కెక్కడికిఁ బోయెదను. మొదట మీరీ నగరంబును జేరికొనునట్లు నియమముఁ జేసికొంటిరా యేమి?
మక :- అవును. (అని సాబిప్రాయముగాఁ దన్ముఖమునఁ జూట్కులు బరగించెను.)
అప్పుడు గుప్తవర్మ తటాలునలేచి హా! రూపవతీ! నిజముఁజెప్పక నన్నింత వేపెదవేల ?నిన్నెన్నాళ్ళకుఁ జూచితిని కౌఁగలించుకొనుటయు అయ్యో! శీలవతీ! నిన్నెరుంగక తొట్రుపడు చుంటినని పలుకుచు నుపగూహనమిన్చినది. అట్లిరువురు బిగ్గరగా గౌఁగలించుకొని దుఃఖింపఁ దొడంగిరి.
సత్వవంతుఁడు వెరగుపడుచు అయ్యో ! అయ్యో ! ఇదియేమి? ఇట్లు శోకించెద రేమిటికి? మీ రొండొరులు తెలసినవారాయేమి? రూపవతీ! యని పిలిచితిరి. వారెవ్వరు ? మీ కథ వినుదనుక నా మనసు వేగిర పడుచున్నది. చెప్పుడు. చెప్పుడు. అని తొందరపెట్టుటయు వారిరువురు నశ్రుజలంబులం దుడిచికొన విడుమర వహించిరి.