పుట:కాశీమజిలీకథలు-05.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కుముదినికా! దానిమ్మపండ్లను బక్షుల దినకుండ ముత్తెపుపేరులం జుట్టుము.

నిపుణికా! మణిసాలభంజికల కుచములయందు కుంకుమరసపత్రభంగముల రచింపుము.

ఉత్పలికా! కనకసమ్మార్జనులచేఁ గదళీగృహములయందలి మణివేదికలం దుడువుము.

మాలతికా! సిందూరరేణువులచేఁ గామదేవగృహదంతవలభికకు రంగు వేయుము.

కేసరికా! భవన కలహంసలకుఁ గమల మధురసం బొసంగుము.

కదళికా! గృహమయూరముల దారాగృహము జేర్చుము.

కమలినికా! చక్రవాకశిశువులకు మృణాళక్షీరరసం బిడుము.

లవంగికా! చకోరపంజరములయందుఁ బిప్పలీతండుశకలంబులఁ బోయుము.

మధురికా! కిన్నరమిథునములను సంగీతశాలల విడువుము.

అట్టి వినోద సంభాషణములన్నియు నాలింపుచుఁ గ్రమంబునఁబోయి కాదంబరీభవనసమీపమును జేరిరి. అందు సేవార్ధమై యరుదెంచి యుభయపార్శ్వముల వసించియున్న యన్నుమిన్నల మణికనకవిభూషణ కిరణజాలంబులు నదీప్రవాహమువలె వ్యాపించుచుండెను. దివ్యరూపసంపన్నులగు గంధర్వకన్యకలు మండలముగాఁ జుట్టునుం బరివేష్టించి కూర్చుండ దివ్యమణిప్రభాధగద్ధగితమగు శ్రీమంటపమధ్యంబునఁ నీలాంశుకవిరచితంబగు హంసతూలికాతల్పంబునఁ దెల్లనితలగడపైఁ జేతులాని మహావరాహ దంష్ట్రావలంబితయగు భూదేవివలె నొప్పుచు దేహప్రభాజాలజలంబు పెచ్చు పెరుగ భుజలతావిక్షేప పరిభ్రమణములచే విదలించుచుండిరో యనఁ జామరగ్రాహిణులిరువంక వీచుచుండ నొయ్యారముగాఁ బడుకొని సఖులతో ముచ్చటింపుచుఁ బర్యంకము దాపున నేలం గూర్చుండి కేయూరకుఁడను వీణావాహకుఁడు మహాశ్వేతయొద్దకు వెళ్ళివచ్చిన వర్తమానములం జెప్పుచుండ నచ్చెరువుతో నాలింపుచున్న కాదంబరీ తరుణీలలామంబు చంద్రాపీడునకు నేత్రపర్వము గావించినది.

భూలోకములో మహాసుందరులని పేరుపొందిన యిందుముఖులు గంధర్వకన్యలకు దాస్యము సేయఁ బనికిరారు. అట్టి గంధర్వకాంతలలో నిరుపమానసౌందర్యశాలిని యని ప్రఖ్యాతి వడసి గంధర్వకులచక్రవర్తి కూఁతురై నిరతిశయభాగ్యవైభవంబులఁ బ్రకాశించు కాదంబరి నా దివ్యస్త్రీల నడుమఁ గనకమణి శ్రీమంటపమధ్యమున హటాత్తుగాఁ జూచినంతఁ జంద్రాపీడుని హృదయ మెట్లుండునో వ్రాయుట దుర్ఘటము. తద్భూషణమణి కరణజాలంబులు కన్నులకు మిరిమిట్లు గొలుప విభ్రాంతుండై యొక్కింతతడవేమియుం దెలియక మోహముతోనుండి యంతలోఁ దెప్పిరిల్లి