పుట:కాశీఖండము.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

458

శ్రీకాశీఖండము


సీ.

[1]చక్రవాళపరీతసర్వసర్వంసహా
        పరమతీర్థములలో గరిమ కాశి
కాశికాపట్టణక్రోశపంచకతీర్థ
        సమితిలో సారంబు జహ్నుకన్య
జహ్నుకన్యాతీర్థసముదాయకమునందు
        గడుఁ బెద్ద మణికర్ణికాహ్రదంబు
మణికర్ణికాతీర్థమజ్జనప్రతతికం
        టెను విశ్వనాథు దర్శన మధికము


గీ.

విశ్వపతికంటెఁ గైవల్యవిభునికంటెఁ
గాలకంఠునికంటె ముక్కంటికంటె
దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల
సత్యమింకను సత్యంబు సంయమీంద్ర!

123


సీ.

అఖిలకాలము శంభు నర్చించినఫలంబు
        సకృదీక్షణంబున సంభవించు
భవసహస్రముల సంపాదితం బగుపుణ్య
        మొకప్రదక్షిణమున కుపమ గాదు
పుష్పప్రదానంబుఁ బోలంగ లేవు షో
        డశమహాదానకాండములు గూడి
తలకూడు నశ్వమేధఫలంబు పంచామృ
        తాభిషేకవిధాన మాచరింప

  1. ‘చక్రవాళపరీత సర్వసర్వంసహా ప్రథితతీర్థములలోఁ బెరుగుఁగాశి’ యనుపూర్వముద్రితపుస్తకపాఠములో యతిభంగము. ఈపాఠ మిష్టమేని ‘చక్రవాక........పృథులతీర్థములలోఁ బెరుఁగు కాశి’ యని సవరించుకొనఁదగు.