Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జోడు దప్ప [1]నసంగతి స్తుతి యొనర్పఁ
బద్యములయందు సహచరభ్రంశ మయ్యె.

135


క.

ఈదోషంబులు మొగి న, ర్థోదిరములు పూర్వభాషితోదారశ్లే
షాదిగుణంబులతోడం బ్ర, మోదంబునఁ గూడి యొసఁగు ముఖ్యార్థములన్.

136


క.

శ్రుతిపరుషత మానుటకై, మతిఁ గర్తవ్యంబు సౌకుమార్యము చెప్పన్
జతురతఁ గాంతి ఘటించుట, వితతగ్రామ్యార్థహరణ విశ్రుతిఁ జేయున్.

137


క.

కృతుల [2]నపుష్టార్థప్రవి, హతికొఱకై చొనుపవలయు నర్థవ్యక్తిన్,
వితతన్యూనాధికపద, యుతిహతికై సమత చెప్ప నొప్పుం గవితన్.

138


తే.

అనుచితార్థనిరాకరణాప్తికొఱకు
నగు నుదాత్తతఁ కావ్యంబులందుఁ జొనుప
యుక్తపాదవిసంధివిచ్యుతి యొనర్చు
పనికి నూర్జస్వి కర్జంబు పద్యములను.

139


ఆ.

తుదిఁ బతత్ప్రకర్షదోషాపహతికి నై
యుక్తి రీతిఁ గావ్య మొగి నొనర్ప
నప్రతీతికపరిహారంబుకొఱకు నై
సుప్రసారగుణముఁ జొనుపవలయు.

140


క.

[3]చ్యుతసంస్కృతి మానుటకై, యతిమధురసుశబ్దవృత్త మగు నొనరింపన్,
బ్రతతప్రక్రమభంగా, హతి కై సంక్రమతఁ గూర్ప నగు నండ్రు బుధుల్.

141


క.

ప్రే[4]యోలంకారము దా, శ్రేయం బగుఁ బరుషదోషశిథిలతకొఱకై
చేయఁ దగుసూక్తితంత్రము, హేయాశ్లీలంబుఁ [5]దొలఁగ నెగుచుటకొఱకై.

142


క.

ఇత్తెఱఁగున మఱియు గుణా, యత్తాలంకారసరణు లరసి కవీంద్రుల్
చిత్తంబున రోషోదయ, వృత్తం బెడలించి కవిత విరచింపఁదగున్.

143

—————

చ.

విరహితవైరికై భువనవిశ్రుతసద్గుణరత్నహారికై
నిరుపమకీర్తికై యువతినిర్మథనక్షమచారుమూర్తికై
విరచితవృద్ధికై సమరవీరవిరాజితజైత్రసిద్ధికై
పరిచితశక్తికై గిరిశపాదపయోజనిషక్తభక్తికై.

144


క.

పరగండభైరవునకై, యరిమానసచండడిండి[6]మారావునకై
కరవాలభైరవోర్జిత, బిరుదునకై నతవినుత[7]నిభృతవరదునకై.

145

తరలము

సుజనపోషణశాలికై [8]రణశూరతావనమాలికై
రజనినాథకులాగ్రగణ్యవిరాజికై [9]జయవాజికై

  1. క.గ.చ. అసంగతస్తుతి
  2. క.గ.చ. అపుష్టార్థార్థవిహతి
  3. క. చ్యుతిసంస్కృతి, గ.చ. చ్యుతిసంస్మృతి
  4. క.గ.చ. అలంకారము గడుశ్రేయంబు
  5. క.గ.చ. తొలఁగ నేఁగుటకొఱకై
  6. క.గ.చ. మారవునకునై
  7. గ.చ. విభృతవరదునకై
  8. క.గ.చ. నయశూరతా
  9. చ. జయదాజికై, గ. యజదాజికై