Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ననఁగఁ బదియేనువిధులఁ గావ్యములయందు
వాక్యదోషంబు లుదయించు; వానిఁ దెలిసి
కబ్బములు చెప్పు నుత్తమకవుల మెచ్చు
విష్ణువర్ధనచాళుక్యవిశ్వవిభుఁడు.

95

క్రమభంగము

క.

శ్రీవిష్ణువర్ధనాఖ్య, క్ష్మావరుకీర్తిప్రతాపమహిమలతో రా
జీవేందీవరమిత్రులు, కావింతురు చెలిమి యనఁగఁ గ్రమభంగ మగున్.

96

విసంధికము

క.

[1]కులఅంబుజఅర్కుం డిల, బలిఇంద్రఉదారుఁ డనెడు[2]పలుకులలో న
చ్చులు హల్లులతోఁ గూడం, గలయక యుండిన విసంధికం బగుఁ గృతులన్.

97

పునరుక్తము

తే.

చక్రి చక్రాయుధుఁడు పోరు సలుపుచోట
ననిన నిది శబ్దపునరుక్త మండ్రు బుధులు
శార్ఙ్గి చాపాస్త్రుఁ [3]డాజి నెసంగునెడల
చేసిన నిది యర్థపునరుక్త మగుఁ దలంప.

98

వ్యాకీర్ణము

క.

తలల వరాహాంక మురం, బుల నాజ్ఞయుఁ దాల్చి విశ్వభూవిభుఁ గొలువం
దలఁపుదు రరు లని చెప్పం, దొలఁగక వ్యాకీర్ణ మనెడురోషం బయ్యెన్.

99

భిన్నవచనము

తే.

అనిశభంగంబులును నసేవ్యములు నైన
యంబునిధు లట్ల [4]గంభీర మగుమనంబు
వశము గా దన్న నది భిన్నవచన మయ్యెఁ
[5]బెక్కుమాటల నొకమాట భేద్య మగుట.

100

భిన్నలింగము

క.

చాళుక్యవిభుఁడు పనుపఁ ద్రి, శూలంబును బోని సేన శూరతచేతం
గూలుదురు వైరు లనిలో, లీలం బొరి నన్న భిన్నలింగం బయ్యెన్.

101

ఛందోభంగము

క.

ఎందును నీరాజున కే, చందంబున లేరు సరి [6]జగంబుల నెల్లన్
[7]సుందరతను శూరత నన, ఛందోభంగంబు గృతులఁ జను దోషం బై.

102

యతిభంగము

క.

చెప్పినయెడ నిలువక వడి, దప్పిన యతిభంగ మనఁగఁ జనుఁ దత్కృతి నీ
[8]చొప్పు నెఱుంగుఁడు తెనుఁగున, నెప్పుడును విరామభంగ మెన్నరు కృతులన్.

103
  1. ఈపద్యమున, ప్రతుల మూడింటను సంధులు కలిసియే యున్నవి.
  2. క.గ.చ. పలుకులతో నచ్చులు
  3. క.గ.చ. ఆజికిఁ జాగునెడల
  4. క.గ.చ. గంభీర మరిమనంబు
  5. క.గ.చ. పెక్కుమాటల కొకమాట
  6. క.గ.చ. జగమ్ముల నెల్లన్
  7. గ. సుందరతను శూరతనానన
  8. క.గ.చ. చొప్పున నెఱుఁగఁడు