Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చారుచళుక్యవిశ్వనృపచంద్రుని నిర్మలకీర్తిచంద్రికా
సారముచే సుహృత్కుముదసంచయముల్ విలసిల్లు గర్వదు
ర్వారవిరోధివారిరుహవారములున్ ముకుళించు నుల్లస
త్సూరి[1]చకోరసంఘములు సొంపు వహించు ధరాతలంబునన్.

18


వ.

ఇది ప్రసిద్ధరూపకాలంకారం; బిందు భ్రాంతిమదలంకారంబునుం గల; దది
యె ట్లనిన.

19

భ్రాంతిమంతము

క.

కవిసమ్మతి నారోప్య, ప్రవణానుభవంబు భ్రాంతిపద మగుఁ దత్సం
భవ మయ్యెడుదానికిఁ బే, రవిరళముగ భ్రాంతిమంత మనఁగాఁ బరఁగున్.

20


క.

చంద్రాన్వయుఁ డగువిశ్వన, రేంద్రుని సత్కీర్తిదీప్తు లేపారుటయున్
[2]సాంద్రతరంబుగ నెల్లెడఁ జంద్రశిలాతతులు పరఁగు సద్రవ లగుచున్.

21


క.

సుకవినిరూపణములచేఁ, బ్రకటిల్లుచు రూపకములు బహులాకృతు లై
వికసిల్లు వానితెఱఁగులు, వికటంబులు తెలియవలయు వివిధస్మృతులన్.

22

దీపకము

ఆదిదీపకము

క.

[3]మొదలను నడుమను నొండెన్, గదిసి క్రియాపదము యొండెఁ గారక మొండెన్
[4]బొదలి తదర్థము దెలిపెడు, నది దీపక మనఁగఁ [5]గృతుల నందం బెపుడున్.

23


శా.

కావించుం గులధర్మ మెప్పుడుఁ జళుక్యక్ష్మావిభుం డొప్పుగా
దేవశ్రేణి మదింప దిక్కరులు మోదింపన్ ధరాభారభృ
ద్గ్రావవ్రాతము సంతసిల్ల భుజగేంద్రప్రీతి సంధిల్ల న
వ్యావిర్భూతపృథుం డితం డనఁగ దివ్యశ్రవ్యకీర్తీశుఁ డై.

24

అంత్యదీపకము

క.

నల నహుష భరత భానుజ, [6]బలి బలిభేదులకు సాటి పాటి తులితుఁ డ
గ్గలికుఁడు గెడ సదృశుం డన, వెలయుం జాళుక్యవిశ్వ[7]విభుఁ డెల్లెడలన్.

25

మధ్యదీపకము

మ.

కవిసంఘంబునకుం బటీర పటికా కస్తూరికా చేటికా
వివిధశ్రీల విభూతియున్ విజయమున్ [8]విశ్వేశ్వరుం డిచ్చుఁ బో;
భువి సర్వజ్ఞుఁడు శంకరుండు నగుటన్ బోలించి శీలించినన్
భవనామస్తుతి భద్రదాయిని గదా భావింప నెవ్వారికిన్.

26

ఆవృత్తి

క.

చెప్పినమాటయ పెక్కుగఁ, జెప్పుట యావృత్తి యనఁగ జెలు వగు; నదియున్
దప్పక మూఁడుదెఱంగుల, విప్పఁ బదార్థోభయానువృత్తులఁ బరఁగున్.

27
  1. క.గ.చ. చకోరసంఘమును
  2. క.గ.చ. రుంద్రతరంబుగ నెల్లెడ
  3. క.గ.చ. మొదలం దుద నడుమ నొండెన్
  4. క. పొదరితదార్థము, గ. పొదవితదర్ధము
  5. క.గ.చ. కృతుల కందం బెపుడున్
  6. క.గ.చ. బలిబలభేదులకు
  7. క.గ.చ. విభుఁ డెల్లపుడున్
  8. క.గ.చ. విశ్వేశ్వరుం డిచ్చుచో