Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధ్వని

క.

పాకాదికృతవ్యంగ్య, వ్యాకీర్ణం బైన కావ్య మది యుత్తమ మై
చేకొనఁబడు మధురార్థ, శ్రీకము ధ్వని యనెడు నెపముచేఁ జెలు వొందున్.

65


ఉ.

ప్రీతిఁ జళుక్యవల్లభుఁడు పృథ్వి వహించి గుణాఢ్యుఁ డైనచో
[1]శాతమదాష్టదంతులు వశావశతన్ జరియించె, శూలికిం
జేతుల భూషణస్ఫురణఁ జేకొనె, వార్డులు గోత్రభూధర
[2]వ్రాతము నిల్వ నయ్యెఁ, గడు మ్రాన్పడె నిర్జరపాదపంబులున్.

66

—————

శక్తిగ్రాహకములు

సీ.

విహితసంయోగంబు విప్రయోగంబును సామర్థ్యమును సాహచర్యకంబు
నర్థవిరోధలింగౌచిత్యచేష్టలు పరిశబ్దసన్నిధిప్రకరణములు
దేశకాలక్రమాదికములు శబ్దార్థకలితానవచ్ఛేదకల్పనములు
స్మృతిహేతుకములు విశేషవాక్యస్వరవ్యక్తులు నాఁగఁ బర్యాయగతుల


తే.

నలరు నన్నింట నర్థంబు నవగమింపఁ
దగు ననేకార్థయుతము లై తనరుశబ్ద
సంతతుల కర్థసంధానచతురు లెల్ల;
నింకఁ దద్వృత్తు లెఱిఁగింతు నెఱుఁగవలయు.

67

కావ్యవృత్తులు

క.

ధీరస్తుత కైశికియును, నారభటియు [3]సాత్త్వతియును నట భారతియున్
జారుతరవృత్తు లివి శృంగారాదిరసంబులందుఁ [4]గరణీయంబుల్.

68

కైశికి

తే.

సకలసుకుమారమధురార్ధ[5]సరళరచిత
కైశికీవృత్తి; శృంగారకరుణరసము
లధికసుకుమారములు, వాని నగు నొనర్పఁ
గైశికీవృత్తిచేతన కవుల కెల్ల.

69


మ.

[6]దళదిందీవరసుందరంబులును నంతఃకౌతుకాంకూర[7]సం
దళితస్నేహములున్ బ్రసన్నములు నై వర్తిల్లు నాలోకనం
బు లుపేంద్రాత్మజు నిందువంశజుఁ గళాపూర్ణాత్మకుం జూచుచోఁ
బొలిచెం బొల్తికి సానురాగరస[8]సంపూర్ణంబులై యత్తఱిన్.

70

ఆరభటి

క.

ఆరభటీవృత్తి యనఁగ, [9]నారూఢాభ్యుద్ధతార్థ, యత్య[10]ద్భుతము
ల్గా రౌద్రము బీభత్సము, నారభటీవృత్తిఁ చెప్ప నగు నీరెండున్.

71
  1. క.గ.చ. సాతిమదాష్టదంతులు
  2. క.గ.చ. వ్రాతము విన్ననయ్యె
  3. చ. భారతియును నటసాత్వతియున్
  4. క.గ.చ. కరణీయ లొగిన్
  5. క. సకలరచిత, గ. సరసరచిత
  6. క. దళితేందీవర
  7. క.గ.చ. సంవళితస్మేరములున్
  8. క.గ.చ. సంపూరంబులై యత్తఱిన్
  9. క.గ.చ. ఆరూఢాత్యుద్గతార్ధయత్య
  10. క.గ.చ. ద్భుతముల్దారౌద్రము