Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూషణార్థి

క.

తివుటవడి నొడువునప్పుడు, వివిధాలంకారవరణి విడువక చవి గా
నవహితుఁ డై కృతి చెప్పెడు, కవి యెందును భూషణార్థి కడుఁ బొగడొందున్.

85

మార్దవానుగతుఁడు

క.

సరళము లగు[1]శబ్దములను, విరళము లగునర్థములను వీనుల కింపం
దరళత లేక రసౌఘము లరుదుగఁ, గృతి చెప్పు మార్దవానుగుఁ డెపుడున్.

86

వివేకి

క.

శ్రతశాస్త్రాలంకార, ప్రతిభుఁడు [2]శబ్దాదిదోషపటుగుణఘటనా
చతురుఁడు వివేకి నాఁ డను, నతఁడు మహాకవిశతంబులందుఁ జరించున్.

87


క.

ఛందోలంకారాదుల, పొం దెఱిఁగిన నెద్ది లేక పొసఁగదు కవితా
[3]సుందరత శక్తి యది యా, కందువఁ వగ నెఱుఁగువాఁడె కవివరుఁ డెందున్.

88


తే.

శక్తి వెలి యైన కావ్యోక్తి సాధనంబు
లెల్ల జీఁకటియింటిలో నిడినసరకు
లెన్ని ఋతువులు గల్గిన నెట్లు పూచు
మహి వసంతాగమము లేక మావిమోక.

89


చ.

వినుతయశంబునం గలుగు విశ్రుతనాకనివాస; మయ్యశో
జననము శ్రవ్యకావ్యములసంగతి నొప్పగు; శ్రవ్యకావ్యముం
దనరుఁ కవిప్రభావమునఁ; దత్కవిసమ్మతి లేనిరాజు [4]లే
పున విహరింప; రవ్విభులు పోయినజాడ లెఱుంగఁ బోలునే.

90

కావ్యభేదములు

తే.

అట్లు వికృత మైన కావ్యత్రయంబు
[5]గద్యపద్యవిమిశ్రసంపాద్య మండ్రు,
నగరముఖ్యాష్టదశవర్ణనములచేతఁ
బరఁగు నదియును భవ్యప్రబంధ మనఁగ.

91

అష్టాదశవర్ణనలు

మ.

పుర వారాశి మహీధరార్తు శశభృత్పూవాదయోద్యానపు
ష్కరకేళీమధుపానమోహనవియోగక్షేమయానస్వయం
వరపుత్త్రోత్సవమంత్రదూత్యగందోర్వైక్రాంతిసంకీర్తనా
కర మష్టాదశవర్ణనాన్వితము [6]తత్కావ్యంబు భవ్యం బిలన్.

92

నగరవర్ణనము

క.

దుర్గమపరిఖావరణని, సర్గబలానీకచతురచాతుర్వర్ణ్యా
నర్గళసంపద్వనజల, వర్గస్తుతి వలయు నగరవర్ణనమునకున్.

93
  1. క.గ.చ. శబ్దముల నవిరళములగు
  2. క.గ.చ. శబ్దార్థదోషపటుగుణ
  3. క.గ.చ. సుందరశక్తియ యదియా
  4. క.గ.చ. ఏపున విహరించి రవ్విభులు
  5. క.గ.చ. పద్యగద్యవిమిశ్ర
  6. గ.చ. సత్కావ్యంబు భవ్యం బిలన్