Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హావము

క.

భావమ యించుక వదన, వ్యావళితవికాస మైన హావము, శృంగా
రావిర్భావనివాసము; భ్రూవల్లీమందచలనమున నెఱుఁగఁబడున్.

22


చ.

అరవిరితమ్మిలో వెడలునమ్మధుపమ్ములఁ గ్రేణి సేయుచున్
గరము విలోచనాంతములఁ గ్రాలెడుచూడ్కుల దందడించున
మ్మరుఁ డెడకాఁడుగా నొకతె మక్కువఁ గన్గొనె సిగ్గు ముందఱన్
దిరుగఁ జళుక్యవిశ్వనృపతిన్ జెలిచాటున నుండి వేడుకన్.

23

హేల

క.

హావము సువ్యక్తవిలా, సావహ మగు నేని హేల యనఁగాఁ బరఁగున్
భావింపఁగ శృంగారము, పై వాఱుచు నారఁబారఁదనరుటచేతన్.

24


శా.

భ్రూతారావలనంబు ఘర్మపులకాభోగంబు రాగంబునున్
జేతోజాతుఁడు తన్ను జోకుటఁ బ్రశంసింపన్ బ్రసన్నోదిత
ప్రీతిన్ జూచెఁ బయోజనేత్ర కుతుకశ్రీపుష్టదృష్టిక్రియా
చాతుర్యంబులు చంద్రికన్ దెగడఁగాఁ జాళుక్యవిశ్వేశ్వరున్.

25

ఈమూఁడును అంగసముద్భవములు.

శోభ

తే.

రూప యౌవన లావణ్యరూఢి సొబగు
సుందరుల కెల్ల రసికులు శోభ యండ్రు;
దలరు నన్యోన్యతుల్యగాత్రములయందుఁ
గడఁగి పెట్టని తొడవయి కానఁబడుచు.

26


ఉ.

కోరి చళుక్యనాథుకడకున్ జనునింతికి రత్నకాంచనా
కారము లైనభూషణనికాయములం దడవంగ నేల; యీ
సూరెలఁ గ్రాలునంగములసోయగ మెంతకు లేదు చూడుఁ డా
మారునిపూవుఁదూపులకు మాఱటరూప మనంగ నొప్పెడున్.

27

కాంతి

క.

ఆశోభయ రంజనగుణ, పేశలయై మించు గలిగి బెరసిన విద్యా
కౌశలులు కాంతి యండ్రు ప్ర, కాశప్రతిభాప్తి నెఱుఁగఁగాఁ దగు బుద్ధిన్.

28


చ.

కలపపుఁబూఁతలోన వెలిఁ గ్రమ్ముచుఁ బయ్యెదచీరమీఁద ను
జ్జ్వల యగునంగకాంతి గరువంపునడం బొలుపారెఁ జూచితే
పొలఁతి కుపేంద్రపుత్త్రపరిభోగమతిన్ జనుచోట నెంతయున్
బలుచనివారిదంబు వెలిఁబర్వు శశిప్రభతోడ సాటియై.

29

దీప్తి

క.

శస్త మగుకాంతికల్పిత, విస్తారము దీప్తి యనఁగ విలసిల్లు శరీ
రస్తుతగభస్తివిభవని, రస్తాలంకారకరణ యగు సతి కొప్పున్.

30