Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయోల్లాసము

క.

శ్రీలుఁడు ప్రణతావనిపతి, మౌళిమణిద్యుతిసమేతమంజీరుఁడు తే
జోలంకారుఁడు ధృతిసుర, శైలుఁడు చాళుక్యవిశ్వజనపాలుఁ డిలన్.

1


శా.

శ్రీ నిండారఁగ లోకరక్షకొఱకై సిద్ధించుటంజేసి ల
క్ష్మీనాథుం డగునయ్యుపేంద్రుఁ డటు లేఁగెన్ గాన నీనూతన
క్ష్మానాథుం డగు విశ్వనాథునకు శృంగారాధినాథత్వ మెం
తే నొప్పుం బ్రణుతింప నంచుఁ గవు లుత్ప్రేక్షింతు రెల్లప్పుడున్.

2


క.

కావున నుపేంద్రునకు ల, క్ష్మీవనితకు దనయుఁ డైనశ్రీవిశ్వేశ
క్ష్మావరునకుఁ బ్రియకరముగ, భావితశృంగారరసముఁ బ్రణుతింతుఁ దగన్.

3


క.

ఉక్తవిభావాదులచే, భక్తనవస్థాయిరూపభావంబులు సు
వ్యక్తములై నిజగుణసం, సక్తము లై రసము లన రసత్వము నొందున్.

4


తే.

స్థాయిభావంబులకు ననుసారు లైన
తద్విభావాదులను రసత్వంబు గలుగుఁ
ఒరఁగ వెన్నకుఁ బాకసంప్రాప్తిఁ జేసి
తగుఘృతత్వంబు కలుగుచందమున నెపుడు.

5


క.

వినువారికిఁ గనువారికిఁ, దనరు విభావానుభావదర్శననయముల్
ఘనరసపోషకములు నాఁ, జనుఁ గవితానాట్యములఁ బ్రసన్నాకృతు లై.

6


తే.

ప్రోడలకుఁ గావ్యములయందుఁ బొందు రసము,
ద్రష్టలకు నాట్యములయందుఁ దనరు రసము
స్ఫుటవిభావానుభావసంఘటనచేత
సాత్వికవ్యభిచారిసంసక్తిచేత.

7


క.

రస మారోప్యం బగుటన్, బొసఁగదు నాట్యములయందుఁ, బొల్పగుఁ దత్త
త్ప్రసరస్మరణముచేతన్, వెస సామాజికులయందు వేడ్కకు నెలవై.

8

శృంగారరసము

క.

అతులానందాత్మిక యగు, రతియె విభవాదిభావరంజనముల సం
వృత యై శృంగారరసా, కృతిఁ జెందు మనోనురాగకీలితగతులన్.

9


క.

ద్వివిధం బగు శృంగారం, బవిరళసంభోగసంభవాత్మకమును గై
తవవిప్రలంభజము నన, యువతిప్రియజనులవలన నుదితం బగుచున్.

10

సంభోగశృంగారము

క.

అనులాపాలింగనద, ర్శనచుంబనమోదనప్రసాధనవిధులన్
వనితలుఁ బతులున్ దమలోఁ, జెనయుట సంభోగజనితశృంగార మగున్.

11