పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

రేయి నిగూఢవృత్తిని జరింపుచు విందుము లౌక్యవాక్యముల్
పాయక సర్వకాలమును బావనకీర్తి పురూరవుండ దా
నీయవనీతలంబునకు నేలిక గావలె ధర్మశాలి జే
జే యని వేయునోళ్ల నుతిచేయనివారలు లేరు భూవరా.

54


తే.

నీయశఃపుంజగగనధునీప్రపూర్తి, విగతపంకౌఘ మైనయీజగమునందు
నన్నివార్తలు మంచివై యమరుఁగాక, యితరవార్తలు గలవె నరేంద్రచంద్ర.

55


ఉ.

చూచితి మొక్కవింత యొకచో జనవల్లభ చిత్తగింపు విం
ధ్యాచలమౌళ్యుపాంతగహనాంతరపద్ధతి వచ్చుచుండ దృ
గ్గోచరమయ్యె మాకు బహుకుందతమాలరసాలసాలజం
బూచలపత్రపూగముఖభూరుహషండము నేత్రపర్వమై.

56


శా.

నానాదేశములందుఁ జూతుముగదా నారంగజంబీరజం
బూనింబామ్లకదంబకుందకదళీపున్నాగచాంపేయతా
ళీనీపక్రముకాదిపాదపలసల్లీలావనంబుల్ తదు
ద్యానశ్రీకి సమాన మౌనె యొకయింతైన న్నరేంద్రోత్తమా.

57


తే.

అమరతరువుకు సంతానమనిన పేరు, నగవిభంజనుతోఁటకు నందకాఖ్య
మదనసంహరువనికిఁ గుమారసంజ్ఞ, యగుట తద్వనసంతతి యగుట నేమొ.

58


సీ.

ఆశాఖ లౌన్నత్యవైశాల్యసాంద్రతాచ్ఛాదితాశాఖలు జనవరేణ్య
యాపల్లవములు మోహనమంత్రమూర్తీభవత్పల్లవంబులు వరగుణాఢ్య
యాసుమనోరాజి యామోదముదితాభ్రచరసుమనోరాజి శౌర్యధుర్య
యాలతల్ జితయౌవనారంభబాలికాజనతనూఖేలతల్ వినుతచరిత


తే.

యాపరాగంబు లుత్పాదితాధ్వసీన, హృదయసుమచాపరాగంబు లింద్రవిభవ
యౌవనం బాశ్రయిష్ణునానావిహంగ, మృగకుటుంబావనంబు ధాత్రీకళత్ర.

59


మ.

కలకంఠాంచితకంఠపంచమకుహూకారంబులుం గీరకో
మలవాచానినదంబులుం గలరవామందధ్వనుల్ శారికా
కలనాదంబులు చంచరీకచయఝంకారంబులున్ దట్టమై
చెలఁగుం దద్వనసీమ మన్మథజయశ్రీగీతికారావ మై.

60


తే.

అట్టిశృంగారవనము సొంపమరఁ గాంచి, యద్భుతంబంది మఱియును నచటగల్గు
వింత లెల్లను గనుఁగొను వేడ్కఁ దద్వ, నాంతరము సొచ్చి విహరించునవసరమున.

61


క.

మణిరశనాగుణకింకిణి, గణహంసకకంకణానుకరణరవంబుల్
కిణికిణికిణికుణుకుణుకుణు, ఝణఝణఝణ మనుచు నొకదెసన్ వినఁబడియెన్.

62