పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనరంజనము

48


గీ.

నానమైఁ గొంకు గదిరెడునాతివీక్ష
ణంబు లనియెడి యరివిరినల్లగల్వ
తూపులను విభుధైర్యంబుఁ దూలనేసి
యలరుఁగైదువజోడు బిట్టార్చె నపుడు.

27


గీ.

ఇంతిసౌందర్యరేఖాదిదృక్షచేత
నెపుడు తెర వంతురను, వంచినపుడు గోరు
నిమిషపరికల్పితాంతరాయము విదిర్చ;
భూమిపతులందు వాంఛాప్రపూర్తిగలదె?

28


వ.

తదనంతరంబ,


చ.

అలఁతికవు న్వడంక వలయధ్వనినిర్మలబాహుమూలకాం
తులు గొనియాడ లేనగవు తొంగలిరెప్పల డాఁగ హారము
ల్మెలిగొన జిల్గుపయ్యెద చలింపఁ గుచద్వయి రాయిడింబడం
జెలి దలఁబ్రాలు వోసె నృపశేఖరునౌదలపైని దోయిటన్.

29


మ.

అలమన్ మైఁబులకాంకురాళి దగహాసాంకూరము ల్కన్గవం
దొలక న్ముత్యపుటొంట్లు గండయుగళిం దూఁగం గనత్కంకణం
బులు మ్రోయ న్భుజమధ్యసీమరతనంపుందాళి తార్మాఱుగాఁ
దలఁబ్రా ల్వోసె లతాంగియౌదలపయిన్ ధాత్రీశుఁ డత్యాదృతిన్.

30


క.

తలఁపునఁ బేర్కొనుకోర్కుల
చెలువున నొకచేతి కొక్కచే యెచ్చనఁగాఁ
జెలిపైఁ బతి పతిపైఁ జెలి
తలంబ్రా ల్వోసిరి మనోరథము లీడేఱన్.

31