పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

తృతీయాశ్వాసము


మ.

అతులోత్సాహముతో నుశీనరధరాధ్యక్షుండు దానాప్తసం
తతితో బంధులతోఁ బురోహితులతో నానానృపశ్రేణితో
జతురంగంబులతో నెదుర్కొని హరిశ్చంద్రాధిపుం దోడితె
చ్చి తగం గాంచనసౌధపాళి విడియించె న్నేర్పు దీపింపంగన్.

9


చ.

మరకతసమంచితకాంచనరత్నవేదులన్
సురుచిరకాయమానముల శోభితపట్టవితానపంక్తులం
బరిమళవస్తుజాలముల భాసిలు బల్విడిదిండ్లు చూపినం
బరిణయవీక్షణాగతనృపాలకకోటి వసించె నందులన్.

10


క.

ఎక్కడఁ జూచినఁ గాల్బల,
మెక్కడఁ జూచిన రథంబు లిభతురగచయం,
బెక్కడఁ జూచినఁ దామై
క్రిక్కిఱిసెం బైటనాల్గు కెలఁకుల సేనల్.

11


క.

నరవరశిరోమణి యుశీ
నరునిసభామంటపంబునం జంద్రమతీ
పరిణయకర్ణేజపములు
పరగెం బ్రస్థానభేరిభాంకరణంబుల్.

12


గీ.

అంతట నుశీనరుఁడు మఱికొంతవడికి
మంత్రులను బిల్చి కల్యాణమందిరమున
నధిపుఁ దోడ్తెచ్చునది యని యానతీయ
వేడ్క రాజేంద్రునకు విన్నవించుటయును.

13