పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనరంజనము

36


ఉ.

ఆనగుముద్దుమోముసొగ, సాయిఱిగుత్తపుచన్నుదోయితీ,
రానునుఁదళ్కుమేనిహొయ, లాతెలివాలికకన్నుదోయియొ,
ప్పానెఱికీలుగంటునొఱ, పాయసదున్నునుఁగౌనుచెల్వ మా
హా, నుతియింపఁగా వశమె యాగజయానయెయార మేరికిన్?

48


క.

లోకత్రయాభినంద్యశు
భైకవయోరూపగుణసమగ్రిమచేత
న్నీకుఁ దగు నావధూమణి,
యాకన్యకు నీవ తగుదు వవనీశమణీ!

49


క.

కులరూపగుణసమగ్రిమ
గలజవ్వని గలుగు టరుదు గలిగినయేని
న్నలువకు వేమోములుగల
చిలువకుఁ దన్మహిమ వినుతి సేయందరమే?

50


క.

ఆపుంస్కోకిలవాణికి
నీపయిఁగలకూర్మిచేత నిద్రాహార
వ్యాపారము లుడిగెను వసు
ధాపాలక, చెప్పనే లితరభోగేచ్ఛల్?

51


క.

తెలుపుడు చేయంగలనా
చెలియమనోవ్యథ; శుభస్యశీఘ్ర మ్మను న
ప్పలు కాదరింపఁగావలెఁ;
బలుకులు వేయేల ధరణిపాలవతంసా!

52