పుట:కవికర్ణరసాయనము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముకుళితవికసితాంబురుహోత్పలములకు, నెడయాడునలికాంతు లెసఁగెఁ గాక
విటులకై మెండాడువీథులజంతల, పెనుఁగాటుకలకప్పు బెరసెఁ గాక


గీ.

వాడఁబాఱెడువిరహిణీవదనసమితి, కందుపొందున నగునల్పు గలసెఁ గాక
కానినాఁడింతదట్ట మీఁ గలదె మొదల?, ననఁగ జీఁకటి యంతంత కగ్గలించె.

90


సీ.

కరఁచి చిప్పలఁ బట్టుకత లెఱుంగము గాక, వ్రాయంగ నిది మషీరసము గాదె?
యిది గుణంబులు సేయువిర వెఱుంగము గాక, నీలాలసరులు గా నింపరాదె?
కరవటంబులఁ బెట్టువెఱ వెఱుంగము గాక, వనితల కిది నవాంజనము గాదె?
కడవలఁ గొని ముంచుగతి యెఱుంగము గాక, చేలల కిది మంచినీలి గాదె?


గీ.

పోవఁ డే నిది రవి నైనఁ బొదువుఁ గాదె? యంక మను పేర నురముపై నచ్చు దా
గాక శశి నైన దిగమ్రింగుఁ గాదె? యనఁగఁ, బ్రబల మై గాఢతమతమఃపటలి పర్వె.

91


తే.

అర్కు వెన్నాడి రాజశుద్ధాంతగణముఁ, దారకల బందెఁ గొని యెందు మాఱు లేక
యంధకారంబు జృంభితం బైన దీప, కలిక లతిభీతి శరణాగతము లయ్యె.

92


వ.

ఇట్టి గాఢాంధకారం బుదయించుటకు మునుమున్న.

93

జారవిటవిటీవర్ణనము

సీ.

మడమలు మోవంగ మైలచీరలు గట్టి, కర్ణముల్ మోవంగఁ గాటుక లిడి
మోఁచేతిపట్టులు మోవ గాజులు దొడి, గలకముల్ మోవఁ గొప్పులు ఘటించి
వెడలి గద్దువ మోవ వీడియంబులు చేసి, కాంక్షఁ జెంపలు మోవ గంద మలఁది
చెక్కిళ్లు మోవంగఁ జెవుల నాకులు వెట్టి, బొమలు మోవఁగఁ జుక్కబొట్టు దీర్చి


గీ.

భావభవుచేతివిడివాటుబడియద్రుడ్లు, సంజప్రొద్దున బలుపిశాచములుఁ బోలె
మెదల భయము గ జనుఁ బట్టి వదల రైరి, వీథు లరికట్టి పురి గట్టివేశ్య లపుడు.

94


సీ.

చిటికలు వ్రేయుచుఁ జిఱుపాట పాడుచు, జార్చి పయ్యెదఁ గూడఁ జేర్చుకొనుచుఁ
గన్నరూపము నెల్లఁ గరసంజ్ఞఁ బిలుచుచు, నెటకేనిఁ జనువాని కెదురు సనుచుఁ
గడచి పోవచ్చినఁ గౌఁగిటఁ బట్టి నీ, వా? యంచు వదలి మోహంబు రేఁచి
చూపినవెలకు నంతే పొ! యనుచు జంకె, వేయుచు రోయుచు వెంటఁబడుచు


గీ.

రూక లడుగుచు దుదిఁబచ్చనాకు కైన, నొడఁబడుచు హస్తగత మైననొడియ నడిచి
దొడ్డబందాటమునఁ గోకఁ ద్రోసికొనుచు, గుడిసెజంతలు తెరువాటుగొట్టి రపుడు.

95


చ.

ముడిఁగిముసుంగుతో వెనుక ముందును జూడక వచ్చి లోనికిం
దొడుకొని పోయి వ్రేలిడిన ద్రొబ్బినఁ బెంపునకుం బసిండికిం
జెడి తముఁ దార తిట్టుకొని చీ యని కేలు విదిర్చి రోయుచున్
గుడిసెలు దూఱి వెల్వడరి క్రొత్తగుసిగ్గరిమిండ లయ్యెడన్.

96