పుట:కవికర్ణరసాయనము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోలె నిజమూర్ధ్న్యంతర్గతచంద్రంబును, బురందరుండునుంబోలె నధఃకృదభీష్టావృష్టిద
మేఘంబును, ఐరావతంబునుంబోలె నఖండగండస్థలప్రమదాపాదకంబును, శబ్దశాస్త్రం
బునుంబోలెఁ బ్రకటితధాతువిశేషంబును, చార్వాకసిద్ధాంతంబునుంబోలెఁ గూటముక్తి
ప్రతిషిద్ధాకాశంబును నై వెండియు నొండుచందంబున భీమసత్వసంపన్నంబయ్యును
గీచకకులవర్ధనకారణంబును, గుహాశోభిశం బయ్యును దారకాసురవిహారోచితస్థానం
బును, బహుకోటీవజ్రవిజృంభితం బయ్యును గరుత్మదుపలకలితంబును, నిరంతరచంద్ర
కాంతం బయ్యును బద్మరాగపరభాగస్ఫురితంబు నగువిచిత్రశోభాస్పదం బగునన్న
గోత్తమంబునం గలుగువివిధవిశేషంబుల కరు దందుచు నుత్సాహంబున.

231

మాంధాత మందరముపై జయస్తంభముల నాటుట

క.

మేరునగ మెక్కి యటఁ జని, యారాజశిరోవతంస మటఁ గాంచె సుధా
ధారాపాతక్షాళిత, రారాజత్కనకకందరము మందరమున్.

232


సీ.

కస్తూరికామృగీకర్ణేజపంబులు, నిర్ఘరీనివహపాణింధమములు
బహుమహీజపరాగపశ్యతోహరములు, ఫణిమిథునప్రియంభావుకములు
శబరసతీరతిశ్రమతాళవృంతముల్, వంశసారస్వతావాపకములు
చమరవాలసమీరసద్బ్రహ్మవాదులు, తతబర్హిబర్హసంధాయకములు


తే.

కుంజవిహృతికళాభద్రకుంజరములు, మందరాచలవనమందమారుతంబు
లెదురుకొన నమ్మహాగిరి యెక్కి యందు, జనవరుఁడు నిల్పె నిజజయస్తంభపటలి.

233


వ.

ఇట్లు స్వర్గపుప్రాంగణక్రీడాశైలం బైనమందరమహీధరంబుపయిం జయస్తంభంబు వ్రేసిన.

234

మాంధాతృ డింద్రపూజితుఁడై పురంబు చేరుట

ఉ.

విస్మయమగ్నుఁ డై యటకు వృత్రహరుం డరుదెంచి భూవిభున్
సస్మితసాధువాక్యరచనం బ్రియ మాడి విరోధి మండలీ
ఘస్మరి నీకు నీడు త్రిజగంబుల లీ రని యెన్న నేల? శౌ
ర్యస్మయరేఖ రావణమహాసురఁ గెల్చితి వాజి నెక్కటిన్.

235


తే.

అనుచు నగ్గింపఁ బూజించి యనుప మరలి, ఖేచరీగీతవిఖ్యాతకీర్తి యగుచు
విజయవాదిత్రములు మ్రోయ నిజపురంబు, వేడ్క మెయిఁజొచ్చి పాలించె విశ్వధరణి.

236

ఆశ్వాసాంతము

ఉ.

పూతవిహార హారరుచిపూరితరంగితవత్స వత్సల
త్వాతిశయాత్మదా వినయదాంతికగోచర గోచరాంగనా