పుట:కవికర్ణరసాయనము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మలమూత్రపంకిలమాతృగర్భంబున, నతిసుకుమారదేహము దపింప
ముడియకట్టుగ వీఁపునడుమునెమ్ములు వంగి, యుల్బపరీతుఁ డై యుండి లోన
నత్యుష్ణలవణకట్వమ్లాదితన్మాతృ, భోజనంబులకాఁకఁ బొక్కిపడుచుఁ
బరితృప్తి ముడువఁ జాఁపఁగ సమర్థుఁడు గామి, సర్వాంగముల నొప్పి సంఘటిల్ల


గీ.

నూర్పు వెడలక విజ్ఞానముక్తిఁ బూర్వ, జనిశతంబులఁ దలపోసికొనుచు నిట్లు
కాంచు దుస్సహగర్భదుఃఖంబు మొదలఁ, బ్రాణి ప్రాచీనకర్మనిబంధనమున.

102


సీ.

ప్రేరకోత్కటసూతిమారుతాహతి గర్భ, మున నధోముఖముగాఁ బొరలఁబడుచు
దేహసంకోచకద్రౌహిణానిలముచే, నానాస్థిసంధిబంధములు నొగుల
శుక్లమూత్రపురీషశోణితావృతి బ్రుంగి, ముఖము విచ్ఛిన్న మై మొదల వెడలఁ
గేశమూర్ఛాయుక్తిఁ గ్రిమివోలె నెట్టకేఁ, దల్లిదుర్గంధరంధ్రమున వెడలి


గీ.

జగతిఁ బడి బాహ్యవాయుసంస్పర్శనమున, నెఱుక చెడి కావుకావున నేడ్చుఁ బ్రాణి
ఱంపమునఁ గోయుగతి ముండ్లఁ ద్రెంపునట్లు, యోనియంత్రప్రపీడచే నొడలు నొవ్వ.

103


చ.

మలమున బ్రుంగుఁ డైనతలిమంబుపయిన్ శయనించి మేను చీ
మలు దిన మక్షికల్ గఱవ మానుప నేరక యొత్తిగిల్లి పై
నొలసినతీఁట గోఁకికొని నోపకయే వ్యవహారమజ్జనా
దులును బరేచ్ఛఁ గైకొనుచు దుఃఖము వొందు శిశుత్వవేళలన్.

104


క.

గురుజననిరోధక్షా, కరణంబులవలన నిలుపు గానక క్రీడా
పర మగుహృదయము దుఃఖా, కర మై తపియించుఁ బ్రాణి కౌమారమునన్.

105


సీ.

ఎవ్వండ? నెందుండి యెచటి కేమిటికి నే, బద్ధుండ నైతి నేబంధనమునఁ?
గారణం బెయ్యది? కాదు కారణ మెద్ది?, యెద్ది కారణజన్య? మేది కాదు?
ధర్మ మే దేది? యధర్మంబు నే దిప్పు?, డెందు వర్తించెద? నందు నిలువ?
నేది కృత్య? మకృత్య మెయ్యది? గుణసంవి, శిష్ట మెయ్యది? దోషజుష్ట మెద్ది?


గీ.

యనువివేకంబు లేక ప్రాయమునఁ క్రొవ్వి, పశువువోలె శిశ్నోదరపరుఁడు నరుఁడు
సంచరించుచు నజ్ఞానసంభవంబు, నధికతర మైనదుఃఖంబు ననుభవించు.

106


క.

కరణకళేబరపాటవ, కర మగుప్రాయంబు తనకుఁ గలుగుటకు దురా
చరణమ ఫల మగు శిశ్నో, దరపరుఁడు సుఖంబ కాఁగఁ దలఁచు న్వగయున్.

107


శా.

అజ్ఞానం బనఁగాఁ దమోవిలసనం బజ్ఞానకార్యోదయం
బజ్ఞానానుగుణంబ కాన గళితోక్తాచార మౌ దానికిన్
బ్రాజ్ఞుల్ ప్రాప్యఫలంబు నారకము కా భాషింతు రట్లౌటచే
నజ్ఞానాదుల నిందు నందు నిజ మై ప్రాపించు దుర్దుఃఖముల్.

108