పుట:కవికర్ణరసాయనము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గని విని ము న్నెఱుంగ మిఁకఁ గల్గెడుశంకయు లేదు లేదు మా
కనఘ! భవద్విలోకవజహర్షము దక్కఁగఁ దక్కు వాంఛయున్.

7


వ.

విశేషించియు నీచేయువినయాతిరేకంబునం బొడమెడు పరమప్రసాదాతిశయంబు
మదీయమానసంబుల వరప్రదానోన్ముఖంబులం జేసి వేగపెట్టెడు నగుటం గోరినయది
సర్వప్రయత్నంబుల నొడఁగూర్చువారము, నీ కెద్ది యభిమతం బెఱింగింపు మనినం
బొంగి నృపపుంగవుండు పునఃప్రణతుండై.

8


సీ.

పూర్వాస్తశైలముల్ పొలిమేర లగుధాత్రి, కొడయుండ నేన వేఱొకఁడు గలుగఁ
డేకరాజక మైనయీవిశ్వధాత్రి న, ధర్మంబు శబ్దమాత్రంబు లేదు
విత్తాధిపతి కైన విస్మయం బొనరించు, విత్తసంపద కింత వెల్తి లేదు
మానసంబున నేని మఱి దేహమున నేని, యెదవునాధివ్యాధి యొకఁడు లేదు


గీ.

నాకు వెక్కసించునాయీమహైశ్వర్య, మింకఁ బరుల కైన నేమి చెప్ప
నేమి కొదవ నెట్లు గా నా కిది, ప్రార్థనీయ మనుచుఁ బలుక నేర్తు?

9


క.

కావున సంపద్విషయం, బై వేఁడుకొనంగఁ దగినయది లే దంత
ర్భావమున నాకుఁ దెలియం, గావలసినయర్థ మొకటి కల దతిహిత మై.

10


తే.

లక్షితము సేయ దేశకాలస్వభావ, విప్రకర్షంబు లేక యీవిశ్వ మెల్లఁ
గరతలామలకంబు గాఁ గనునతీంద్రి, యప్రబోధంబు గలపుణ్యు లరయ మీరు.

11


క.

మీయెఱుఁగనియర్ధము లే, దీయెడ నను మీ రనుగ్రహింపుదు రేనిన్
నాయడుగునర్థమునకుఁ గృ, పాయతమతి నొసఁగవలయుఁ బ్రత్యుత్తరమున్.

12

మాంధాత మునులం దనపూర్వజన్మవృత్తాంతము నడుగుట

సీ.

అస్మదీయం బైనయాంగికం బగుతేజ, మతిలోకమై యున్న దద్భుతముగ
భావంబు నట్టుల భగవత్పదాంభోజ, భావనామృతపానపరవశంబు
మీకోడ లైనయీమెలఁతకు నాయట్ల, తనుకాంతిహరిభక్తు లనుపమములు
విశ్వైకవంద్య! యీయైశ్వర్యమును నాకుఁ, జోద్య మైన దనన్యసులభ మగుట


గీ.

నిట్టిమహిమలఁ బొంద మున్నెట్టివార, మేమి సుకృతంబు చేసితి మింకమీఁది
భవమునందును నీపెంపుఁ బడయుటకు ను, పాయ మెయ్యది? వివరించి పలుకవలయు.

13


వ.

అనిన నందఱు నట్టివిచిత్రప్రశ్నంబునకుం దగినయుత్తరంబు చెప్పుటకు నరుంధతిపతి
ననుమతించి నియమించిన విజ్ఞానఖని యగునమ్మహాత్ముండును నివాతప్రదీపంబురూపం
బున ముహూర్తమాత్రం బుపరతబహిరింద్రియుం డై యోగసమాధివశంబున నయ్య
ర్థంబు గాంచి ప్రసాదసుముఖుం డగుచు నభిముఖుం డై మునిసభామధ్యంబున నంద
ఱు వినుచుండ నమ్మహారాజచంద్రున కిట్లని చెప్పం దొడంగె.

14