పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

77

ద్వితీయాశ్వాసము

 
   క. అరిగితి మపు డేనును దుం
      బురుఁడును విశ్వావసుండు మొదలుగ వీణా
      ధరుల మొకకొందరము త
      త్పరతయు భక్తియుఁ దలిర్పఁ దత్సేవకునై 71

   వ. ఇవ్విధంబున దేవమునిసంఘంబులు వచ్చి సేవింప విష్వక్సేనుండు వేత్రహస్తుం డగుచు సందడి
      యెడగలుగ జడియుచు బరాబరి యొనరింప దివ్యవారాంగనానాట్యంబు లవలోకించుచు న ద్దేవ
      దేవుండు పేరోలగమ్మున నున్న సమయంబున.72

  ఉ. వారిదపంక్తిలో వెడలివచ్చు మెఱుంగులపిండు నా సఖీ
      వారముతో రమారమణి వచ్చెను హెగ్గడికత్తె లెందఱేఁ
      గోరి భజింప నాకొలువుకూటముముందరివంక నొప్పుసిం
      గారపుఁదోఁట నుండి యధికం బగు వైభనమింపుమీఱఁగన్ 73

  ఉ. నెచ్చెలిపిండుఁ దానును వనీస్థలిదండ నొకింత గానఁగా
      వచ్చెనో లేదో యాకమలవాసిని యంతనె యేమిచెప్పుదున్
      హెచ్చినసంభ్రమంబున ననేకులు బద్దలవార లెక్కడన్
      వచ్చియొ మోఁది రాకొలువువారిఁ గకాపికలై చన న్వడిన్ 74

   క. అప్పుడు మముబోంట్లకతల్
      చెప్పఁగ నేమిటికిఁ దారసిలి వేత్రధరుల్
      గొప్పఁగఁ జనియె న్నిలువక
      యప్పరమేష్టియును నచటి కతిదూరమునన్.75