పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

కళాపూర్ణోదయము

శా. నీచే నొక్కమహా ప్రబంధముఁ గడు న్నిర్ణిద్రసారస్యలీ
    లాచిత్రం బగు దాని నోయనఘ వాలాయంబుఁ జేయించుకో
    మాచిత్తంబున వేడ్క యుండు నది నీమాధుర్యధుర్యోరువా
    గ్వేచిత్రి న్సఫలంబుసేయుము సుధీవర్గంబు లోహోయనన్

మ. ఇట మున్గారుడసంహితాదికృతు లీ వింపొందఁగాఁ బెక్కొన
    ర్చుట విన్నారము చెప్పనేల యవి సంస్తుత్యోభయశ్లేషసం
    ఘటనన్ రాఘవపాండవీయకృతి శక్యంబే రచింపంగ నె
    చ్చట నెవ్వారికినీకె చెల్లెనది భాషా కావ్యముం జేయఁగన్

క. అని యాదరణము మిగులం
    దనర నియోగింప నేను నాకొలఁది గనుం
    గొన కీయకొంటిఁ దగ నా
    యనముఁడు సంకల్పసిద్దుఁ డనునమ్మికచేన్. 15

 వ. ఇవ్విధంబునం బూని యమహాప్రభువుసగౌరవనియోగంబునకు ననుగుణంబుగ మదీయశక్త్యనుసారంబున విచారించి యత్యపూర్వకథాసంవిధాన వైచిత్రీమహానీయంబును శృంగాగరసప్రాయంబును బుణ్యవస్తువర్ణ నాకర్ణనీయంబును నగుకళాపూర్ణోదయం బనుమహా కావ్యంబు నిర్మింపం గడంగితి నిట్టిమహనీయ కృతి కధీశ్వరుం డగుచుం బెంపొందునంద్యాలభూవిభునిగృష్ణరాయనివంశావతారం బభివర్ణించెద.

గీ. సకలకువలయపాలనైశ్వర్యయుతుఁడు
   చండధామకృతశ్రీఘనుండు నైన
   రాజచంద్రుండు జగతిఁ గరంబు వెలయు
   సంతతోదయ సౌభాగ్యశాలి యగుచు. 17