పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కళాపూర్ణోదయము

   చ్చటఁ దన కింత గానకళసంపదకల్మి యెఱుంగనీఁడ ము
   చ్చటపడి యిట్లు విష్ణుఁడుప్రసన్నతఁ దాఁబిలిపించునంతకున్ . 94

క. తమవిద్య నెవ్వ రేమా
   త్రము గనఁజాలుదురు వారిదండను దన్మా
   త్రము ప్రకటింతురు బుధు లు
   త్తములమహిమ నీరుకొలఁది తామర సుమ్మీ. 95

క. ఇటు గాక విను జనంబుల
   పటిమకు నెక్కుడుగ విద్య పచరించుట య
   క్కట విఫలము గాదే యె
   చ్చటఁ జెవిటికిఁ బట్టినట్టిసంకును బోలెన్. 96

వ. అది యట్టుండి నేను నది మొదలుగాఁగ నెక్కడెక్కడ నక్కజపుగానవిద్య గలవారు గలరు వారి నరసి
   యరసి తద్విద్య సాధించుచు నెందునుం దుంబురునకు నీడు గాఁజూలమి
   యెడనెడం బరికించుచుం బెద్దకాలంబు ప్రవర్తిల్లి యీమనోరథంబు సర్వజ్ఞుం డైనపుండరీకాక్షుని
   యనుగ్రహంబుననకాని ఫలియింప నేరదని నిశ్చయించి తద్దేవునిం గూర్చి చిరకాలంబు తపం
   బొనర్చితి నంత. 97

సీ. అంజనాచలగర్వభంజనాచలలీల
                 నీలవర్ణపు మేనిడాలు దనరఁ
    బుండరీకముల నుద్దండరీతుల గెల్చి
                 చెన్నొందునిడు వాలుఁగన్ను లమర