పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

ఈతంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమునుండి వెలువడు ఆంధ్రగ్రంథములలో నీయుషాపరిణయప్రబంధముకూడా నొకటి. నాయకరాజుల కాలములో సరస్వతోముఖాభివృద్ధిఁ జెందిన యాంధ్రభాషకు నిట్టిగ్రంథములే ప్రబలతార్కాణములు. వచనగ్రంథములు, ద్విపదకావ్యములు, ప్రబంధములు, యక్షగానములు, శతకములు, పదములు, కీర్తనలు మొదలగు నానావిభాగములలో నాకాలమునఁ బెక్కుభంగుల వెల్లివిరిసిన యాంధ్రవాఙ్మయ మాంధ్రవాఙ్మయచరిత్ర మందును నట్లే తంజావూరుయందును దనకొక ప్రత్యేకస్థానమును సంపాదించుకొనినది. ముఖ్యముగా రఘునాథనాయకుని (1614-1633) కాలములోను నతని కుమారుఁడైన విజయరాఘవనాయకుని (1633-73) కాలములోను తంజావూరునం దాంధ్రభాష బహుముఖవికాసమును బడసినది. నాటితంజావూరు పరిస్థితి ప్రభువులనుకూడ కవిత్వమునకుఁ బ్రోత్సహించినది. కేవలకవితతో వారు తృప్తి నొందలేదు. కొన్ని రసవత్తరములగు గ్రంథములను సృష్టించి తమమాతృభాషాభిమానమును జక్కగ నిరూపించుకొని ధన్యులైరి. స్త్రీలుకూడ కవయిత్రులై తమసరసకవితచేఁ దమ ప్రభువులఁ దృప్తిపఱచి తన్మూలమున నాంధ్రభాషావికాసమునకుఁ దోడ్పడిరి. స్త్రీలలో రంగాజమ్మ, కృష్ణాజి (కృష్ణమాంబ) మొదలగువారు ముఖ్యురాండ్రు.

పై చెప్పిన విభాగములలో నప్రతిహతమైన తమకవితాచాతుర్యమును జాటుచు గ్రంథముల సృష్టించిన యప్పటికవులు తమగ్రంథములఁ గొన్నిటిని ననువాదరూపములుగను గొన్నింటిని స్వతంత్రగ్రంథములుగను వెలయించిరి. ప్రాయికముగా స్వతంత్రగ్రంథములకంటె ననువాదరూపములగు గ్రంథము లెక్కుడు. దీనఁ దత్కవులయొక్క సునిశితభాషాద్వయపారంగతత్వము సువ్యక్తమగుచున్నది. అనువాదరూపములగు గ్రంథములే యైనను స్వతంత్రగ్రంథముల కెంతమాత్రము తీసిపోక సకలవిధములఁ బరిపుష్టములై సరసమృదుమధురవచోనిగుంభితములై రసికజనమనోరంజకములై స్వతంత్రగ్రంథములకన్న నెక్కుడుగఁ గన్పట్టుచున్నవి. అట్టిగ్రంథములలో నీయుషాపరిణయముకూడ నొకటి యగును. ఇయ్యది గీర్వాణభాష యందుఁ బ్రసిద్ధమైన వ్యాసకృతమగు హరివంశమందుఁ బ్రసిద్ధమైన యితివృత్తము. ఈకథ మూలముగా స్వీకరింపఁబడి మహాప్రబంధమునకుఁ గల కొన్ని ముఖ్యలక్షణ