పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

115


క.

ఖగకులనాథుఁడు దక్కఁగ
నొగి నేకాదశసహస్రయోజనములుఁ దా
మగటిమిఁ జని యతిదుర్గమ
మగు శోణపురంబుఁ జేర్చ నన్యుల కగునే.

4


చ.

అన విని కంసమర్దనుఁడు నట్లన నెమ్మదిలోఁ దలంచునం
తన వినతాతనూభవుఁ డుదారగతిం జనుదెంచి యచ్యుతుం
గని వినియావనమ్రుఁడయి గ్రక్కునఁ బార్శ్వమునందు నిల్చి య
య్యనఘునకుఁ బ్రమోదముగ నంజలిబంధముఁ జేసి యిట్లనెన్.

5


సీ.

దనుజభంజన! నన్ను దలఁచిన పనియేమి?
        యానతియిమ్ము నెయ్యంబు మీర
భవదీయబలగుప్తపక్షవిక్షేపంబు
        చే నెవ్వనిపురంబు? వో నడంతు
మీర చేపట్టిన మేలిమిచేఁ బాంచ
        జన్యచక్రంబులు శార్ఙ్గగదలు
మొదలైన యాయుధంబుల దర్పమునకు నా
        దర్పోద్ధతికి నసాధ్యంబు గలదె!


గీ.

యనుటయును శౌరి యాదరాయత్తదృష్టి
నతని వీక్షించి వినుము ఖగాధినాథ!
బలితనూభవుఁడగు బాణుఁ డలఘుశక్తి
గర్వదుర్వారపిశునతాఖర్వుఁ డగుచు.

6


గీ.

కదనమునఁ గిట్టి తనబలమదము నెల్ల
మాయఁ జేసిన యనిరుద్ధు మాయఁ జేసి
నాగపాశబద్ధునిగా నొనర్చినాఁడు
తెలియఁడో! కాక భవదీయతీవ్రశక్తి.

7