పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

ఉద్భటారాధ్యచరిత్రము


గీ.

తొడరి యింతంత యనరాని పొడవు నయ్యుఁ
గుదురుకొంటివి యేరీతిఁ గొమ్మచంట
నిట్టి నీసొంపు వర్ణింప నెవ్వఁ డోపు?
హరిణలాంఛనజూట! పశ్యల్లలాట!

14


చ.

అని శివుఁ బ్రస్తుతించి వసుధాధిపచంద్రుఁడు సద్గురూపది
ష్టనియమపద్ధతిం దవిలి చామయుఁ దా నుచితస్థలంబు గై
కొని బుధపూజనాదుల నకుత్సితభక్తి నొనర్చి చేసె నం
దనఫలసిద్ధికై తపము తత్పరతన్ జగదద్భుతస్థితిన్.

15


మ.

బహిరుద్భాసితశంభుమూర్తిని మనఃపద్మస్థితుం జేసి భూ
మహిళాభర్త జితేంద్రియత్వమును సౌమ్యస్ఫూర్తియుం బూని లో
సహితవ్రాతముదర్పమున్ సడలఁజేయన్ జాలి చేయుం దపం
బు హరిత్పాలురు మౌనులుం జనులు నుద్భూతాద్భుతు ల్గా మదిన్.

16


గీ.

కొన్నినాళ్లు హవిష్యంబు గుడుచుఁ గొన్ని
నాళ్లు ఫలములు దినుఁ గొన్నినాళ్లు త్రావు
నారములు గాడ్పు లొకకొన్నినాళ్లు గ్రోలు
నొల్లఁ డెవ్వియు మఱి యంతనుండి నృపుఁడు.

17


క.

పతి యేక్రియ వర్తించును
సతియును వర్తించు నట్ల సన్మార్గమునన్
బతియట్ల మెలఁగవలదా
పతి దేవతలైన పుణ్యభామల కెల్లన్.

18


సీ.

నిర్మేఘ మగుమింట నిర్గమించిననీరు
        ధరణిపరాగంబుఁ బరిహరించుఁ
బరిమళంబును మందభావంబు గలిగిన
        గంధవాహము శైత్యగతుల వీచుఁ