పుట:ఉత్తరహరివంశము.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

ఉత్తరహరివంశము


ప్రభాప్రహాసితతరణిమండలంబులును గోపావేశవిశంకటభ్రుకుటిచటుల
లలాటదేశంబులుం బరస్పరకృపాణఘట్టనప్రభావిహాయస్సముత్థితస్ఫులింగధూమ
కేతుసముపలక్షీతానిమిత్తంబులును శింజినీటంకారపాదస్థితబిరుదకటకధ్వానసింహా
నాదవిడంబితనిస్సాణనిస్వనంబులును మఱియునుం గోదండంబు లుద్దండులై
ధరించియుం జరించియు గదలు ప్రొదలు (!) చెలంగం బట్టియుం దట్టియు శరం
బులు గరంబుల నమర్చియుం జెమర్చియు శక్తులు శక్తులకు నిచ్చియుం బుచ్చియుఁ
గఠారంబులు గుఠారంబుల కొసంగియు నెసంగియుఁ బట్టసంబు లట్టహాసంబులతోఁ
గదలించియు ముదలించియు బల్లెమ్ములు బల్లెమ్ముల విఱువ సవరించియుఁ జంద్ర
హాసంబులు మందహాసంబులతో జళిపించియు దళిపించియుఁ దోమరంబులు చామ
రంబులతో నొనర్చియుం దనర్చియుం బ్రాసంబులు రోసంబులతో సారించియు గారిం
చియు సబళంబులు సుబలంబులుగా నొత్తియు నెత్తియు శల్యంబులు తుల్యంబులుగా
ధరించియు భరించియు నారసంబులు సారసంబులతోఁ దిట్టలు గొనం గూర్చియు
నేర్చియుఁ బలకలు పులకలు నెగయఁ బాటించియుఁ దాఁటించియుఁ గంక
టంబులు సంకటంబులని తమయేలికల నడిగియుం దొడిగియు నలుదెసలం
బరఁగుకాలుబలంబులును గూడం జనుదేర విమతపతాకినీప్రతిభయమూర్తియగు
బాణాసురుండు బాహుసహాస్రధృతనిఖిలశస్త్రాస్త్రసందోహుం డై నారాయణుం
దాఁకె మఱియును

184


శా.

ఆరూఢోరగవైరి యైనశతపత్త్రాక్షుం బ్రవీక్షించి దు
ర్వారక్రూరమదాభిమానవిలసద్వైషమ్యసంపాదనో
దారస్ఫారభుజాబలాతిశయితాతారుణ్యభాస్వద్యశ
స్ఫారవ్యాప్తచతుఃపయోనిధివృతక్ష్మామండలాభోగుఁ డై.

185

బాఁణుడు కృష్ణునితోఁ బ్రతాపోక్తులు పలుకుట

క.

బాణుం డిట్లను నిన్ను
బ్రాణముతో మగుడ నీను పట్టణమునకున్
రేణూకృతతనుఁ జేసి ప్ర
వీణత మైఁ బరగువాఁడ వేయును నేలా.

186