పుట:ఉత్తరహరివంశము.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

ఉత్తరహరివంశము

షష్ఠాశ్వాసము

శ్రీకలితయోగిహృన్నా
ళీకాంతర్నిజనివాస లేఖాధిపసం
ధ్యాకాలమూలజపన
స్వాకారోంకారరూప హరిహరనాథా!

1


వ.

దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

2


చ.

తెలతెల వేగునంత నరుదెంచి నభోమణివోలె నారదుం
డలరుమొగంబుతో సభ రయంబునఁ జొచ్చినఁ గంసవైరి య
క్కొలువున మించియు న్మనసు గుందగఁ బీఠము డిగ్గి యమ్మునిం
బలుకుల గోప్రదానమధుపర్కములం బరితృప్తుఁ జేసినన్.

3


చ.

అతఁడు సితాంబరావరణమైలమహామణిపీఠ మెక్కి య
చ్యుతు నిజసింహపీఠగతుఁ జూచి మురాంతక! యెంత చిన్న వో
మితి మది నెంత వంత గల దీ యదువీరుల నేల చాల ధీ
రతఁ దరలించి చిత్తముల రాఁజెద రన్న మురారి యిట్లనున్.

4


క.

మునినాథ చెప్పఁ జిట్టలు
మనయనిరుద్ధుండు నిన్న మగువలు గొలువం
దవయింట రాత్రి నెమ్మది
నునికి గలిగెఁ బిదప నున్న యునికిన యడఁగన్.

5