పుట:ఉత్తరహరివంశము.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఉత్తరహరివంశము


క.

ఎనుఁబది యెనిమిది వేవురు
దనుజుల కాఢ్యుండు వక్రదనుజుఁడు దోడై
చనుదేర హంసడిభకులు
[1]చెనకిన వెసఁ దునిమె శౌరి చెప్పెద నదియున్.

6


సీ.

సాల్వదేశంబున జనియించె బ్రహ్మద
                 త్తాభిరానుండు మూర్థాభిషిక్తుఁ
డఖిలధర్మవిధిజ్ఞుఁ డాత్మభార్యాద్వయం
                 బునకు బిడ్డలు లేమిఁ బొల్లవోయె
సంసార మనుచు నీశాను నారాధించెఁ
                 బదియేఁడు లొండు సంభ్రమము లేక
పరమేశుఁ డతని సద్భక్తికి మది మెచ్చి
                 కలలోన నొకనాఁడు గదిసి వరము


తే.

వేఁడికొను మన్న నిరువుర వేఁడె సుతుల
శివుఁడు నిచ్చితి ననుచు విచ్చేసె నంత
నతనిదేవు లిద్దరును గర్భాభిరామ
మూర్తులయి రన్నరేంద్రుండు ముద్దుసేయ.

7


ఉ.

ఆ సమయంబునందు మహితాత్ముఁడు మిత్రసహుండు నాఁగ ధా
త్రీసురుఁ డొక్కరుండు జగతీపతికిన్ సఖుఁడై సుతోదయో
ల్లాసము లేక శ్రీపతిఁ దలంచుచుఁ దప్పక పంచవర్షముల్
చేసిన పూజకుస్ హరియుఁ జిత్తములోఁ బొడసూపి విప్రుతోన్.

8


ఉ.

మెచ్చితి వేఁడికొ మ్మనుడు మిత్రసహుండు కుమారుఁ గోర నీ
కిచ్చితి నంచు నచ్యుతుఁడు నేఁగె ధరామరుఁ డాత్మకాంతకుం
జెచ్చెరఁ దోఁచు వేవిళులు చెప్పఁగఁ బల్మఱు వచ్చుబోఁటితో
ముచ్చటనూనె నల్ల చనుముక్కులు వెల్వెల బారు చెక్కులున్.

9


క.

ఈవిధమున గర్భిణు లగు
మూవురలో రాజసతులు మునుమును సుతులన్

  1. తను జెనకినఁ దునిమె శౌరి తగనది వినుమా.