పుట:ఉత్తరహరివంశము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

47


వ.

అనుటయు వైశంపాయనుం డాజనమేజయున కిట్లను జనార్దనుండు
రజతాచలంబునకు నరుగుటయు నద్దేవుండు నిశ్చలతపశ్చరణంబుల నుండు
టయు నవ్విభుని దివ్యమునిగంధర్వదేవతానివహంబు చూడవచ్చుటయు నచ్చట
హరుం డానారాయణునకు వరం బిచ్చుటయు నయ్యిరువురయేకత్వంబు సకల
లోకంబులుఁ దెలియుటయుం దెలియం జెప్పెద నాకర్ణింపుము.

71


శా.

కంసారాతి మురామురారినరకక్రవ్యాదముఖ్యాసుర
ధ్వంసాపాదనవీతకంటకవతిన్ ద్వారావతిన్ రుక్మిణీ
హంసీహారమృణాలహారిభుజమద్యస్భారకాసారుఁడై
సంసారార్ణవసారమన్మథసుధాసారంబునం దేలఁగన్.

72


సీ.

యమునాతరంగడోలాధిరోహణమున
                 [1]డంబుమీఱెడుమరాళంబువోలె
హరినీలమణిమనోహరమందిరస్తంభ
                 ముల వినోదించు కీల్బొమ్మవోలె
దళితనీలోత్పలదళదామసంగతిఁ
                 గొమరారుసంపంగిగుత్తివోలె
దరుణతమాలపాదపశిఖాశాఖలఁ
                 జెలువారువలరాచచిలుకవోలె


తే.

బారిజాతగోవర్ధనోత్పాటనమున
బలిమి తొడవైన మురవైరిబాహుయుగము
తెప్పగా మన్మథాంబుధిఁ దేలుచుండె
రమ్యగుణమణి రుక్మిణిరమణి ప్రీతి.

73

రుక్మిణీదేవి తనకు సుపుత్త్రు ననుగ్రహింపుమని శ్రీకృష్ణుని వేఁడుట

శా.

ఆరామాతిలకంబు మన్మథవినోదైకాంతగేహంబులో
గారామై యొకనాఁడు లేనగవు శృంగారంబుగాఁ గన్నులం
బారం బేదనిలజ్జఁ దోఁప హరికిం బాదప్రణామక్రియా
ప్రారంభం బగుభ క్తిఁ గుట్మలితహస్తాంభోజయై యిట్లనున్.

74
  1. దళుకొత్తు పసిఁడినెత్తమ్మివోలె