పుట:ఈశానసంహిత.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము - ఈశానసంహిత

పీఠిక

శ్రీపరమేశ్వరానుగ్రహమున ఆంధ్రసాహిత్యపరిషత్తువారి యమోఘపరిశ్రమమువలనఁ జిరకాలమునకుముందు శ్రీనాథకవిసార్వభౌముఁడురచించిన శివరాత్రిమాహాత్మ్యము ఆంధ్రమహాశయుల హస్తము లలంకరించినది. చెన్నపురి దొరతనమువారి ప్రాచ్యవిద్యాపుస్తకభాండాగారమువారి యమూల్యపరిశ్రమమున స్కాందపురాణాంతర్గతమగు ఈశానసంహిత లభించింది. శ్రీనాథుఁడు రచించిన శివరాత్రిమాహాత్మ్యమునకు ఈశాససంహిత మూలమని శివరాత్రిమాహాత్మ్యమునందే కలదు. పుస్తకముల సేకరించి ప్రాచ్యపుస్తకభాండాగారమున నిలువఁజేయుటే దొరతనమువారి పనిగాని ముద్రించి ప్రకటించుట వారి కవసరముగాదు. శివరాత్రిమాహాత్మ్యము చదివినవారికి ఈశానసంహితావిషయపరిజ్ఞానముగూడ నత్యావశ్యకమే. కావున దానివిషయమై కొంచెము వ్రాయవలసివచ్చినది. సుమారు పదిపండ్రెండేండ్లకుఁ బూర్వము ఓరియంటల్ లైబ్రరీ పండితులు సుగృహీతనామధేయులు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈశానసంహిత లభించినదనియు, నూఱుశ్లోకములగ్రంథము నాలుగాశ్వాసములుగాఁ బెంచి యనువదించినాఁడనియు, నింక నొక్కయాశ్వాస ముండవలయుననియు, నాకు జాబుమూలమునఁ దెలిపియుండిరి. ఆవిషయము నే నొకవ్యాసములోఁ బ్రకటించియు నుంటిని. ఆగ్రంథముప్రతి శ్రీశాస్త్రిగా రాంధ్రసాహిత్యపరిషత్తున కొసంగిరి. దానిపై నొకవిమర్శనవ్యాసము నాచే వ్రాయింపుఁడనికూడ వారు పరిషత్తునకు వ్రాసిరఁట. పరిషత్తువారు ఆప్రకారమే నన్ను నియోగించుట జరిగింది. తొలుదొల్త శివరాత్రిమాహాత్మ్యమునకుఁ బ్రతి వ్రాసి పత్రికలోఁ బ్రకటించి, అది పుస్తకరూపమునఁ బ్రకటింపఁబడినపుడు దానికిఁ బీఠిక వ్రాసి, తరువాత ననేకవివాదములకు గుఱియైన నా కిప్పు