పుట:ఈశానసంహిత.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విమర్శించి చూచిన నాతని మనీష కాదరణీయాంశ మొక్కటియు నీయధ్యాయమున లేనేలేదు. కావున నాతఁ డీకథాభాగ మాంధ్రీకరింపలేదనియే సిద్ధాంతముగా శివరాత్రిమాహాత్మ్యమునకు వేరొకప్రతి లభించువఱకు మన మంగీకరించుటే సమంజసము. శ్రీనాధుఁ డీ యీశానసంహితనే యాంధ్రీకరించె నను నిశ్చయము జనించుచో సారవంతములైనను నిస్సారములయినను గ్రంథభాగములన్నియు నాంధ్రీకరించెననుట కొంత యుక్తముగా నుండునుకాని యాతఁ డీసంహితను జూడనేలేదేమో యనునూహకు నవకాశము గలుగుచున్నపు డావాద మంగీకరించుట కెట్లు వీలగును. ఈ క్రింది విషయములు పాఠకులు బాగుగా గమనింతురు గాక.

పరిషత్తువారికి లభింపకపూర్వము శివరాత్రిమాహాత్మ్య మెట్లు నామరూపశూన్యమో సంహితయు మొన్న మొన్న దొరతనమువారికి లభించువఱకు నామరూపశూన్యము. మాహాత్మ్యమునకుఁ బ్రత్యంతర మింతవఱకు నగపడదు. సంహితకు నట్లే. మాహాత్మ్యము శిథిలాతిశిథిలము, ఘుణాక్షరబహుళము, గ్రంథపాతభూయిష్టమును. సంహితాప్రతి శిథిలమగునో కాదో యెఱుఁగ రాలేదుగాని గ్రంథపాతములు భూయిష్టములుగానే యున్నవి. విశేషించి యందు "అత్రగ్రంథపాతః" అను వాక్యము మిక్కిలిసంశయమున కాస్పదమైయున్నది. మాహాత్మ్యమున నేసందర్భమున గ్రంథపాతమని యూహింపఁబడుచున్నదో ఆసందర్భముననే సంహితియందు "అత్రగ్రంథపాతః" అను వాక్యము కంఠోక్తిగా నుండుటకుఁ బ్రబలకారణ ముండవలదా? ఈశానసంహితయనుపేర నీనాఁటికి లభించిన యీయసమగ్రగ్రంథ మొక్కటితక్క మఱి యెక్కడ నేదియుఁ గానరాలేదు. ఖండములు గలది యొకటియు సంహితలు గలది యొకటియు రెండు స్కాందములు గలవు. అం దొకటి మహాపురాణము, నింకొకటి యుపపురాణము నని వ్యవహరింపఁబడుచున్నవి. అవి యిపుడు ముద్రితములయ్యు నముద్రితములయ్యు ననేకబ్రతు లగపడుచున్నవి. వానిలోని సంహితలును ఖండము