పుట:ఆహార కల్తీ నివారణ చట్టము, 1954.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

పనికిరానంతగా చెడిపోయినదని స్థానిక (ఆరోగ్య) ప్రాధికారి అభిప్రాయపడిన యెడల, సదరు ప్రాధికారి విక్రయదారుకు వ్రాతమూలక నోటీసు నిచ్చిన తరువాత దానిని నాశము చేయించవచ్చును.

(5) ఈ పరిచ్ఛేదము ద్వారా ఒసగబడిన అధికారములో ఏదేని ఆహార పదార్ధము ఉన్న ప్యాకేజీని పగులగొట్టి తెరచు అధికారము, లేక ఏ ఆహార పదార్ధమునైనను విక్రయము కొరకు ఉంచబడినట్టి ఏదేని ఆవరణ తలుపును పగులగొట్టి తెరచు అధికారము చేరియుండును:

అయితే, ప్యాకేజీని గానీ, తలుపును గాని పగులగొట్టి తెరచునట్టి అధికారమును, ప్యాకేజీ సొంతదారు, లేక దాని బాధ్యతగల లేక సందర్భానుసారముగ ఆవరణమును తన ఆక్రమణము నందుంచుకున్న ఎవరేని ఇతర వ్యక్తి, అచట హాజరు నందున్నచో ప్యాకేజిని, లేక తలుపును తెరవవలెనని అతనిని ఆదేశించిన మీదట అతడు అట్లు చేయుటకు నిరాకరించిన తరువాత, ఈ రెంటిలో ఏ సందర్భములోనైనను అట్లు చేయుటకు గల కారణములను వ్రాసియుంచిన తరువాత మాత్రమే, వినియోగించవలెను:

అంతేకాక, ఆహార ఇన్ స్పెక్టరు ఈ పరిచ్ఛేదము క్రింద ఏ స్థలములోనైనను ప్రవేశించి తనిఖీ చేయు అధికారములను వినియోగించుటలో, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 కింద జారీ చేయబడిన సోదా వారంటును అమలు పరచుటలో ఒక పోలీసు అధికారి ఏదేని స్థలమును సోదాచేయుటకు, లేక తనిఖీ చేయుటకు సంబంధించి ఆ స్మృతిలో గల నిబంధనలను వీలైనంత మేరకు అనుసరించవలెను.

(6) ఏదేని ఆహార పదార్ధ ము యొక్క తయారీదారు, లేక పంపిణీదారు, లేక వ్యాపారస్థుని స్వాధీనమునందుగాని, అందుకై అతని ఆక్రమణమునందున్న ఏదేని ఆవరణయందు గాని దొరికినదై దానిని స్వాధీనము నందుంచుకొనినందుకు అతడు ఆహార ఇన్ స్పెక్టరుకు తృప్తిగా సమాధానము చెప్పజాలనట్టి కల్తీకి ఉపయోగపడు దానిని దేనినైనను మరియు అతని స్వాధీనము నందు గాని, నియంత్రణ యందు గాని ఉన్నట్లు, కనుగొనబడి, ఈ చట్టము క్రింది ఏదేని దర్యాప్తు కైనను, లేక చర్యకైనను ఉపయోగకరమగు లేక సంబద్దమైనవగు ఏవేని ఖాతా పుస్తకములను, లేక ఇతర దస్తావేజులను ఆహార ఇన్ స్పెక్టరు అభిగ్రహించ వచ్చును. అట్లు, కల్తీకి ఉపయోగపడు దాని యొక్క మచ్చును విశ్లేషణము కొరకు పబ్లికు విశ్లేషకునకు సమర్పించవచ్చును.

అయితే, ఆహార ఇన్ స్పెక్టరు అధికార రీత్యా ఏ ప్రాధికారికి అధీనస్థుడో ఆ ప్రాధికారి పూర్వామోదముతో తప్ప, అట్టి ఖాతా పుస్తకములను గాని, ఇతర దస్తావేజులను గాని అభిగ్రహించరాదు.

(7) ఆహార ఇన్ స్పెక్టరు ఉపపరిచ్ఛేదము (1) యొక్క ఖండము (ఏ) క్రింద, ఉపపరిచ్ఛేదము (2) , ఉపపరిచ్ఛేదము (4), లేక ఉపపరిచ్ఛేదము (6) క్రింద ఏదేని చర్యను తీసికొనిన యెడల, అతడు అట్టి చర్యను తీసికొనునప్పుడు ఒకరిని, లేక అంతకెక్కువ మందిని హాజరు కావలసినదిగ పిలిచి అతని సంతకమును లేక వారి సంతకములను తీసికొనవలెను.

(7-ఏ) ఆహార ఇన్ స్పెక్టరు ఉపపరిచ్ఛేదము (6) కింద ఏవేని ఖాతా పుస్తకములను గాని, ఇతర దస్తావేజులను గాని అభిగ్రహించిన యెడల, వాటిని ఏ వ్యక్తి నుండి అభిగ్రహించినాడో ఆ వ్యక్తి, ధ్రువీకరించినట్లుగా వాటి నకళ్లను గాని, వాటినుండి ఉదాహృతులను గాని విహిత పరచబడినట్టి రీతిలో తీసికొనిన తరువాత వాటిని అభిగ్రహించిన తేదీనుండి ముప్పది దినములకు మించని' కాలావధిలోపల ఆ వ్యక్తికి వాపసు చేయవలెను:

అయితే, అట్టి వ్యక్తి, అట్లు ధ్రువీకరించుటకు నిరాకరించియుండి ఈ చట్టము క్రింద, అతనిపై అభియోగము తేబడియుండిన యెడల, న్యాయస్థానము ధ్రువీకరించినట్లు అట్టి ఖాతా పుస్తకములను మరియు ఇతర దస్తావేజుల నకళ్లను, లేక వాటి నుండి ఉదాహృతులను తీసికొనిన తరువాతనే వాటిని అతనికి వాపసు చేయవలెను.