పుట:ఆముక్తమాల్యద.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నారికేళాసవపుఁదీఁపుటూరు పొలయ,
వలిపెయొంటొల్లెతో నురస్స్థలులఁ గూర్కు
ప్రియల వేకువఁ దొడ నెచ్చరించి కలసి
రెలమి ధన్యులు దఱపివెన్నెలబయళ్ళ.

61


చ.

హృదయము లెప్పుడు న్గలయకే తఱచౌ వెడకౌఁగిలింతలున్
గదిరెడు మేలుకార్యములఁ గల్గక మాటలయందె కల్గుపె
న్జదురులు వట్టిశైత్యములుఁ జాల ఘనం బయి మండు వేసవిన్
బొదలఁగ నిల్చె దంపతుల పొందు లనార్యుల పొందుకైవడిన్.

62


ఉ.

తీలగు కంతువెంబడినె తెమ్మెరలు న్రవిదీప్తి కల్కి పా
తాళముఁ బట్టుచుండఁ దమతావులు మ్రుచ్చిలఁ బట్టి యోషధీ
పాలున కప్పగించె ననఁ బై సురభిశ్వననంబు నించెఁ గాం
తాలసవక్త్రసీమ విటు లార్చు నుశీరపుఁదాళవృంతముల్.

63


చ.

సమసి కథావశిష్టమగు చందనశైలసమీరణంబుఁ గృ
త్రిమగతి నింద్రజాలమునఁ దేఁ దొడఁగెన్ భువిఁ దాలవృంతజా
లము; లది మాయ యౌటకుఁ దలంపఁ దదీయమయూరపింఛికా
భ్రమణమె సాక్షిగాదె, నగరంబున నట్టికడిందివేసవిన్.

64


తే.

అట్టివేసవి బెడిదంపు వెట్టకతన
హస్తము సెమర్చి సారెకు లస్తకంబు
దుసికిలఁగఁ గాదె సవరింప వసము గాక
పుష్పబాణుని చెఱకువి ల్పుడమిఁ బడియె!

65


మ.

తరుణు ల్దల్లియొఱ న్కుచంబు లునుపం దచ్ఛైత్యము ల్దీములై
పెరరేపం జనుదెంచెఁగాక! రవిదీప్తిం గ్రుంగి పాతాళగ
హ్వరముల్ తూఱిన వారి నీయదుకుఁద్రాళ్ళా తెచ్చు?' నా దీర్ఘత
చ్చిరకృష్టిం గనునీటిశైత్య మలరించె న్నూతులం దత్తఱిన్.

66


మ.

స్వనిదానోగ్రనిదాఘవైఖరినె యూష్మన్మల్లిక ల్కామినీ
కనదానీలకచాగ్రపంక్తి నెఱియల్గాఁ బాపఁగాఁ, బాటల
న్ఘనతం దేనియసోనఁ గూర్చె; నది యౌఁగాఁ నాభియు న్నిర్నిషం
బును దోఁబుట్టవులయ్యు వేర్పడ గుణంబు ల్సూపఁగా జూడమే?