పుట:ఆముక్తమాల్యద.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ప్రబలతర బాడబీకృతేరమ్మదములు
భాస్వదేరమ్మదీకృత బాడబములు
పతగ సమ్రాట్‌ పతత్ర ప్రభంజనములు
వృజిన తూలౌఘములఁ దూల విసరుఁగాత.

3

విష్వక్సేనుని బెత్తమునకు వందనము సల్పుట

ఉ.

పూని ముకుందు నాజ్ఞఁ గనుబొమ్మనె కాంచి యజాండభాండము
ల్వానను మీఁదఁ బోవ నడువ న్గొనెఁ దన్నన నగ్రనిశ్చల
త్వానచలత్వనిష్ఠలె సమస్తజగంబుల జాడ్యచేతవ
ల్గా నుతి కెక్కు సైన్యపతి కాంచనవేతము నాశ్రయించెదన్.

4

పాంచజన్యవర్ణనము

మ.

హరి పూరింపఁ దదాస్యమారుతసుగంధాకృష్టమై నాభిపం
కరుహక్రోడమిళిందబృంద మెదు రెక్కం దుష్క్రియాపంకసం
కరదైత్యానుపరంపరం గముచు రేఖం బొల్చు రాకానిశా
కరగౌరద్యుతి పాంచజన్య మొసఁగుం గళ్యాణసాకల్యమున్.

5

నందకవర్ణనము

మ.

ప్రతతోర్ధ్వాభాగపీఠయుగళీభాస్వత్త్సరుస్తంభసం
స్థితిఁ దీండ్రించెడు జాళువా మొనలివా దీప్తార్చిగాఁ గజ్జ లా
న్వితధూమాసితరేఖపై యలుఁగుగా విజ్ఞానదీపాంకురా
కృతి నందం బగు నందకం బఘలతాశ్రేణి చ్ఛిదం జేయుతన్.

6

కౌమోదకీవర్ణనము

ఉ.

యాదవసార్వభౌమ భయదాయత బాహునియుక్తిఁ జేసి యెం
దే దనుజేంద్ర సాళ్వపుర హేమమణీవరణంబు సంగతం
బై దివి నాత్మకంకణము లం దొకె కంకణ మయ్యె నట్టి కౌ
మోదకి మోదకీలిత సముజ్జ్వలకల్పకమాల్యఁ గొల్చెదన్.

7